సెల్ ‘విశ్వ’రూపం
దుబాయ్: చేతిలో సెల్ ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. అందరికీ అదొక అత్యవసర పరికరంగా మారిపోయింది. వచ్చే డిసెంబరు నాటికి ప్రపంచంలో సెల్ ఫోన్ల సంఖ్య మొత్తం జనాభా సంఖ్యను మించిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అప్పటికి ప్రపంచ జనాభా 700 కోట్లుంటే సెల్ల సంఖ్య 730 కోట్లకు చేరుతుందని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కంపెనీ సిలికాన్ ఇండియా తెలిపింది.
ఇప్పటికే 100కు పైగా దేశాల్లో మొబైల్స్ సంఖ్య జనాభాను అధిగమించింది. రష్యాలో 25 కోట్ల సెల్ఫోన్లున్నాయి. అక్కడి జనాభా సంఖ్యతో పోలిస్తే ఇది 1.8 రెట్లు అధికం. బ్రెజిల్‌లోని ఫోన్ల సంఖ్య 24 కోట్లు. ఆ దేశ జనాభాతో పోలిస్తే ఈ సంఖ్య 1.2 రెట్లు ఎక్కువ. ప్రపంచంలో సమాచారం పరిమితంగా ఉండే బీద ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను భారీగా పెంచే సామర్థ్యం సెల్ ఫోన్లకు ఉందని అంతర్జాతీయ మొబైల్ టాప్అప్ ప్రొవైడర్ డింగ్ సీఈఓ మార్క్ రోడెన్ చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో ఫోన్ ఖాతాదారులు టాప్అప్ కోసం నిత్యావసరాలను త్యాగం చేస్తున్నారని డింగ్ పరిశోధకులు తెలిపారు. వర్థమాన దేశాల్లో 60% మంది రోజువారీ సంపాదన 2 డాలర్లకంటే తక్కువగా ఉన్నప్పటికీ వారిలో అత్యధికులకు మొబైల్స్ ఉన్నాయన్నారు.