నేరాల సంఖ్య 14 శాతం తగ్గించాం
పంజగుట్ట: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య 14 శాతం తగ్గించగలిగామని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్‌లో సీసీ కెమెరాల మానిటరింగ్ సిస్టమ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి విద్యుత్సౌధా మీదుగా తాజ్‌కృష్ణా వరకు, జీవీకే మాల్ వద్ద నుంచి తాజ్ డక్కెన్ మీదుగా కేసీపీ జంక్షన్ వరకు పర్యవేక్షించే విధంగా 46 కెమెరాలను ఏర్పాటు చేశారు. 9 మంది దాతల సాయంతో 26.50 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు. మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన అనంతరం పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడారు.
గతేడాది కంటే నేరాల సంఖ్య తగ్గిందని, దీనికి సీసీ టీవీలు, పీడీ యాక్ట్ ప్రయోగమే కారణమని ఆయన అన్నారు. కొత్తగా ఐడెటిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చామని, పాతనేరస్తుడు మళ్లీ ఏదైనా నేరం చేస్తే ఈ సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్ అతడ్ని పట్టిస్తుందన్నారు. ఈ సందర్భంగా కెమెరాల ఏర్పాటుకు సహకరించిన జీవీకే గ్రూప్, బీఎండబ్లు్య షోరూం, కాన్కార్డ్ మోటార్స్‌ను ఆయన అభినందించారు. కెమెరాల ఆవశ్యకతను దాతలకు వివరించి, వారు ఆర్థిక సహాయం చేసేందుకు కృషి చేసిన ఎస్సై బ్రహ్మమురారిని కమి షనర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, డీఐ లక్ష్మీనారాయణ, అడ్మిన్ ఎస్సై నాగరాజు, ఎస్సైలు దాతలు తదితరుల పాల్గొన్నారు.