నర్సింగ్ ‘కంచు’పట్టు
లాస్ వెగాస్ (అమెరికా) : భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో నర్సింగ్ ‘బై ఫాల్’ పద్ధతిలో జెలిమ్ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. నర్సింగ్ కాంస్య పతక ప్రదర్శనతో భారత్‌కు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు ఒక బెర్త్ ఖాయమైంది. హోరాహోరీగా జరిగిన ఈ బౌట్లో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ యాదవ్ ఒకదశలో 4-12 పాయింట్లతో వెనుకబడ్డాడు. అయితే చివరి నిమిషంలో నర్సింగ్ తన ప్రత్యర్థిని ఎత్తిపడేసి ఉడుంపట్టు పట్టాడు.
దీంతో రిఫరీ బైఫాల్ పద్ధతిలో నర్సింగ్‌ను విజేతగా ప్రకటించారు. అంతకుముందు జరిగిన రౌండ్లలో నర్సింగ్ 14-2తో హనోక్ రచమిన్ (ఇజ్రాయెల్)పై; 4-3తో సోనెర్ దిమిత్రాస్ (టర్కీ)పై; 16-5తో లివాన్ లోపెజ్ (క్యూబా)పై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించాడు. అయితే సెమీస్‌లో పురెవ్‌జావ్ (మంగోలియా) చేతిలో నర్సింగ్ ఓడిపోయాడు. మరోవైపు భారత్‌కే చెందిన అరుణ్ కుమార్ (70 కేజీలు) క్వార్టర్ఫైనల్లో 0-10తో జేమ్స్ మాల్కమ్ గ్రీన్ (అమెరికా) చేతిలో ఓడగా, అమిత్ కుమార్ (57 కేజీలు), సుమిత్ (125 కేజీ)లు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.