ఉద్యమాలతోనే సమస్యలకు పరిష్కారం: కె. రామచంద్రమూర్తి
ప్రముఖ సంపాదకులు కె. రామచంద్రమూర్తి
తెలంగాణలో దళితులు రాజ్యాధికారం చేపట్టాలి: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, చిన్నారులకు పౌష్టికాహారలేమి వంటి అనేక సమస్యలు మన దేశంలో ఉన్నాయని, అయినా వాటి పరిష్కారానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రముఖ సంపాదకులు కె.రామచంద్రమూర్తి అన్నారు. బుధవారం సెంటర్‌ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలపై హైదరాబాద్‌లో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎవరో ఒకరు చొరవ తీసుకుని ఉద్యమాలు నిర్మిస్తేనే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని అయన అభిప్రాయపడ్డారు. ఇందుకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లకు చట్టబద్ధత కల్పించడమే నిదర్శనమన్నారు. ఇక, హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేశ్ మాట్లాడుతూ.. దేశంలో మీడియా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం అయిందని గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
సబ్‌ప్లాన్ వంటి అంశాల్లోనయినా మీడియా వైఖరిలో మార్పు రావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 31 నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అవుతాయని, కనుక దళిత, గిరిజనులే అధికారం చేపట్టాలని బీజేపీ నేత కె.లక్ష్మణ్ ఆకాంక్షించారు. సబ్‌ప్లాన్‌ను ఇతర రాష్ట్రాలలో కూడా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడంలో సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య చేసిన కృషిని వక్తలు ఈ సందర్భంగా ప్రశంసించారు. వర్క్‌షాప్‌నకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కో-ఆర్డినేటర్ ఆంజనేయులు అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కె.ఆర్. వేణుగోపాల్, కాకిమాధవరావు, సీడీఎస్ డెరైక్టర్ వైబి.సత్యనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు.