పరీక్షల ఫలహారం
పిల్లల పరీక్షలొస్తుంటే చదువుల మాట ఏమో కాని, వారి ఆహారం పూర్తిగా నిర్లక్ష్యమవుతుంది. జంక్ ఫుడ్, కప్పుల కొద్దీ కాఫీ, టీ వంటివి నిరంతరం తీసుకునేవారు సైతం పరీక్షల సమయంలో ఆహారాన్ని దూరం పెట్టేస్తారు. అందుకే పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే ముందు నుంచే వారి ఆహారం గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.ముందుగానే పిల్లలతో చర్చించి, వారు ఏ ఆహారానికి ఎక్కువ...
ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకుని వాటితోనే వారికి కావలసిన పోషకాలను అందిస్తే మంచిదని కూడా సూచిస్తున్నారు.
ఇడ్లీ, ఉప్మా
ఓట్స్, ముసిలి, ఉప్మా, ఖిచిడీ, ఇడ్లీ... వంటివాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకోవడం మంచిది. ఈ పదార్థాలన్నీ శరీరానికి కావలసిన గ్లూకోజ్‌ను సక్రమంగా అందిస్తాయి.
స్మూతీస్, డ్రై ఫ్రూట్స్
రోజులో నాలుగుసార్లు పెద్ద మొత్తంలో ఆహారం అందించడం వల్ల పిల్లలు వెంటనే నిద్రపోయే అవకాశం ఉంటుంది. రక్తప్రసరణ మెదడు కంటే ఎక్కువగా ఉదరానికి చేరడం వల్ల వారు త్వరగా నిద్రపోతారు. అందువల్ల తరచుగా కొద్దికొద్దిగా పోషకాహారం అందేలా ప్రణాళిక వేసుకోవాలి. ఫలితంగా వారు నిద్రపోకుండా మెలకువగా ఉండగలుగుతారు. తాజా పళ్లు, స్మూతీలు, తేనె కలిపిన డ్రై ఫ్రూట్స్, పిల్లలు ఇష్టపడే సలాడ్లు... ఇవి మంచిది.
మజ్జిగ, గ్రీన్ టీ
పిల్లలు వారికి సౌకర్యంగా ఉండే చోట కూర్చుని, మరీ ముఖ్యంగా ఏసీల ముందు కూర్చుని, దాహం వేయకపోవడంతో, మంచినీళ్లు తాగడం మర్చిపోతారు. దాంతో వారిలో నీటి శాతం తగ్గిపోతుంది. శరీరం, మెదడు సక్రమంగా పనిచేయడం మానేస్తాయి. కళ్లు తిరిగినట్లవుతుంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టలేక పోతారు. పిల్లలు ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ వాళ్లు ఎక్కువ నీళ్లు తాగడానికి సుముఖత చూపకపోతే, తాజా పండ్ల రసాలు, పల్చటి మజ్జిగ, గ్రీన్ టీ వంటివి తరచుగా అందిస్తూండాలి.
అల్లం, చెక్క
ఎక్కువ మోతాదులో కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, టీ, కోలాల... వంటివి పరీక్షల సమయంలో తాగడం మంచిది కాదు. వాటిని తీసుకోవడం వల్ల పిల్లలు సక్రమంగా నిద్రపోలేకపోతారు. అందువల్ల పిల్లలను అలాంటి వాటి నుంచి దూరంగా ఉంచాలి. వాటి స్థానంలో పల్చటి మజ్జిగలో అల్లం, దాల్చినచెక్క పొడి వంటివి జత చేసి ఆరోగ్యకరంగా, రుచికరంగా తయారుచేసి పిల్లలకు తరచు అందచేయాలి.
గుడ్లు, పండ్లు
ఒత్తిడి తీవ్రంగా ఎదుర్కొనే పరీక్షల సమయంలో, శరీరానికి నీటిలో బాగా కలిసిపోయే విటమిన్ బి కాంప్లెక్స్, సి, మినరల్స్, జింక్... వీటి మోతాదు పెరిగిపోతుంది. దాంతో అడ్రెనల్ హార్మోన్ల పని తీరు తగ్గిపోతుంది. ఇవి ఉంటేనే మనిషిలో ఒత్తిడి ఏర్పడినప్పుడు వాటితో తీవ్రంగా పోరాడి, ఒత్తిడి పోగొడతాయి. దంపుడు బియ్యం, నట్స్, కోడిగుడ్లు, తాజా కూరలు, పండ్లు వంటివి ఒత్తిడిని నిరోధిస్తాయి.
చేపలు, ఆకుకూరలు
విటమిన్ ఎ, సి, ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు ఒత్తిడికి గురవకుండా కాపాడతాయి. కోడిగుడ్లు, చేప, క్యారట్లు, గుమ్మడికాయ, తాజా ఆకు కూరలు, తాజా పండ్లు... వంటివి వాడటం వల్ల మెదడు చురుకుగా పనిచేయడం మొదలుపెడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అందువల్ల పిల్లలు పరీక్షల సమయంలో అనారోగ్యం పాలు కాకుండా ఉండగలుగుతారు.
ఇన్పుట్స్: డా. వైజయంతి