ఐ వాంట్ టు ఫాలో ఫాలో ఫాలో ఫాలో యూ...!
మీరు ఎక్కడికి వెళ్లినా మా నెట్వర్క్ మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది.. ఇది ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన యాడ్. ఈ సూట్కేసుకి ఇది కచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఇది మీ వెనకాలే వచ్చేస్తుంది మరి. స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్ సహాయంతో పనిచేసే ఈ హైటెక్ పెట్టెను ఇజ్రాయెల్‌కి చెందిన నువా రొబోటిక్స్ కంపెనీ రూపొందించింది. కంపెనీ అందజేసే యాప్‌ను మీ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని, ఫాలో అన్న బటన్ క్లిక్ చేస్తే చాలు.. కుక్కపిల్లలా ఇది మీ వెనకాలే వచ్చేస్తుంది.
కెమెరా సెన్సర్ల సహాయంతో చూస్తూ.. మీరు ఎటు వెళ్తే అటు ఫాలో అయిపోతుంది. మెట్లు ఎక్కడం, దిగడం చేతకాదు గానీ సమాంతరంగా ఉన్న నేలపై చక్కగా నడిచేస్తుంది. మీరు చూడట్లేదు కదా అని ఎవరైనా దీనిని తస్కరించడానికి ప్రయత్నిస్తే అలారం గట్టిగా మోగుతుంది. అంతేకాదు.. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ చేసుకోవడానికి వీలుగా ఇందులో బ్యాకప్ బ్యాటరీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిశోధనల దశలో ఉన్న ఈ హైటెక్ సూట్‌కేసును మరింతగా స్మార్ట్‌గా తయారుచేసి త్వరలోనే మార్కెట్లోకి తెస్తామని కంపెనీ పేర్కొంది.