యూనివర్సిటీ ఏర్పాటుకు 300 ఎకరాలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ :
ఒంగోలులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పీజీ సెంటర్‌ను పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసేందుకు నగర సమీపంలో 300 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేటాయించినట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్లో మంగళవారం నిర్వహించిన వార్షికోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పీజీ సెంటర్ స్పెషలాఫీసర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఒంగోలులో పూర్తిస్థాయి యూనివర్సిటీ ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు అత్యంత అవసరమని చెప్పారు. విద్యార్థులు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించకూడదని, అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు.
బడుగు, బలహీనవర్గాల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించిన తర్వాత తమ పూర్వ పరిస్థితులు మర్చిపోకుండా ఇతర పేద విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. భారతదేశం మానవ వనరుల ఉపయోగంలో వెనుకబడటానికి గల కారణం నిరక్షరాస్యతేనన్నారు. సమాజ ప్రగతికి విద్య దోహదపడుతుందన్నారు. అందుకే జిల్లాలోని వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదిగేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య వియన్నారావు మాట్లాడుతూ ఒంగోలులో ఏర్పాటు చేసిన ఏఎన్‌యూ పీజీ సెంటర్ అభివృద్ధి కోసం యూజీసీకి నివేదిక పంపినట్లు చెప్పారు. పీసీ సెంటర్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా ఎమ్మెస్సీ స్టాటిస్టికల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఒంగోలులో పూర్తిస్థాయిలో యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలం అడిగిన వెంటనే కేటాయించిన జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే సహకారం అందించాలని కోరారు. ఏఎన్‌యూ ఆధ్వర్యంలో గ్రంథాలయ భవన నిర్మాణాలు కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్, వైస్ చాన్సలర్లను పీజీ సెంటర్ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. కార్యక్రమంలో పీజీ సెంటర్ అధ్యాపకులు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.