ఇంటర్నెట్.. స్పేస్ టు హోమ్
ఓవైపు స్మార్ట్‌ఫోన్ యుగం మొదలైంది. మరోవైపు ప్రపంచంలో మూడొంతుల మందికి ఇంటర్నెట్టే ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే అంతరిక్షంలో ఉపగ్రహాలను మోహరించి భూమిపై అన్ని ప్రాంతాల వారికీ ఇంటర్నెట్ అందేలా చేసేందుకు స్పేస్ఎక్స్, గూగుల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఆకాశంలో డ్రోన్లను విహరింపజేస్తూ ఇంటర్నెట్ను ప్రసారం చేసేందుకు ఫేస్బుక్ కూడా ప్రాజెక్టును చేపట్టింది. అయితే, వీటన్నిటికన్నా ముందే అంతరిక్ష ఇంటర్నెట్ వచ్చేసింది! ఇంటర్నెట్కు దూరంగా మారుమూలల్లో ఉన్న 300 కోట్ల మంది కోసం 12 ఉపగ్రహాలతో ‘ఓ3బీ నెట్వర్క్స్’ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్ష ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది!
ఓ3బీ అంటే.. ద అదర్ 3 బిలియన్. అంటే ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని ‘ఇతర 300 కోట్ల మంది ప్రజల’ కోసం అన్నమాట. భూమి చుట్టూ 8 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతూ సిగ్నళ్లను ప్రసారం చేసే 12 ఉపగ్రహాలను ఓ3బీ నెట్వర్క్స్ మోహరించింది. కొన్ని నెలలుగా ప్రధానంగా భూమధ్య రేఖాప్రాంతంలోని దేశాలు, దీవులకు ఈ ఇంటర్నెట్ సేవ లను అందిస్తోంది. ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌మాదిరిగానే వేగవంతమైన ఇంటర్నెట్ను చవకగానే అందించడం దీని ప్రత్యేకత.
గూగుల్, హెచ్ఎస్బీసీ వంటి అనేక సంస్థల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శాటిలైట్ నెట్వర్క్ నుంచి భూగోళంపై 70 శాతం ప్రాంతాలు కవర్ అవుతాయని, మరో 8 ఉపగ్రహాలను మోహరించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ3బీ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు గ్రెగ్ వీలర్ వెల్లడించారు. భారతీ ఎయిర్టెల్ వంటి 21 కంపెనీలతో ఇదివరకే ఒప్పందాలు ఖరారయ్యాయని, మరో 20 కంపెనీలతో ఒప్పందాలకూ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఇవీ ‘ఓ3బీ’ ప్రత్యేకతలు..
⇒ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ను అందిస్తున్న తొలి కంపెనీ ఇదే.
⇒ స్కూళ్లు, ఆస్పత్రులు, కార్యాలయాలకు 200-500 డాలర్లకే శాటిలైట్ సిగ్నళ్లను స్వీకరించే టెర్మినల్‌ను ఓ3బీ అందిస్తోంది.
⇒ పెద్ద కంపెనీలకు మరింత ఎక్కువ ధరకు పెద్ద యాంటెన్నాలను సమకూరుస్తోంది.
⇒ అంతరాయాలు లేకుండానే వేగవంతమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలను కల్పిస్తోంది.
⇒ ప్రస్తుత ఇంటర్నెట్ సేవల ఖర్చుతో పోల్చితే ఓ3బీ సేవలు చవకే.
⇒ మొబైల్ సేవలకు ‘ఓ3బీ సెల్’, టెలికం కంపెనీల కోసం ‘ఓ3బీ ట్రంక్’, సముద్రప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు ‘ఓ3బీ మారీటైమ్’, ప్రభుత్వ సంస్థల కోసం ‘ఓ3బీ గవర్నమెంట్’ సర్వీసులను అందిస్తోంది.