స్వేచ్ఛ కావాలి.. యువర్ ఆనర్
మానవ హక్కుల సంఘాలు ఉన్నట్లే, ‘అమానవ హక్కుల సంఘం’ ఒకటి యు.ఎస్.లో ఉంది! దీని అధ్యక్షుడు స్టీవెన్ వైస్. మనుషులకు ఉన్న విధంగానే జంతువులకూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలని స్టీవెన్ వాదన. మామూలు మనిషిగా రోడ్డు మీద నిలబడి వాదిస్తే స్టీవెన్‌ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ స్టీవెన్ లాయర్. కోర్టులో వాదిస్తాడు. కొన్నాళ్లుగా ఆయన... టామ్, కికో అనే రెండు చింపాంజీల తరఫున మాన్‌హట్టన్ కోర్టులో తన వాదనలను బలంగా వినిపిస్తున్నారు. అవి రెండూ స్థానికంగా ఓ బోనులో ఉండే చింపాంజీలు. ఫ్లారిడాలోని ఓ పెద్ద సరస్సు మధ్య ఉన్న చిన్నచిన్న దీవులలో హాయిగా, స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ చింపాంజీలను పట్టుకొచ్చి మనుషుల సరదా కోసం ప్రదర్శనకు ఉంచారు. అలా చేయడం నేరమని, తిరిగి వాటిని ఫ్లారిడా దీవుల్లో వదిలేయాలని స్టీవెన్ వాదిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈ వారం తీర్పును ఇవ్వబోతోంది.
నేడో రేపో జడ్జిగారికి జైలు
జడ్జీలు కూడా మనుషులే అనుకుని ఈ వార్త చదవాలి. లేకుంటే న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే ప్రమాదం ఉంది. ఆర్నాల్డ్ ఆగ్డెన్ జోన్స్ అనే ఆయన ఒకప్పుడు జడ్జి. నార్త్ కరోలినాలో పనిచేసేవారు. తన భార్యకు ఎవరితోనో వివాహేతర సంబంధం ఉండేదని ఆయన అనుమానం. మరి ఆ విషయం తేలేదెలా? తనకు పరిచయం ఉన్న ఒక లాయర్ని పట్టుకున్నాడు. అతడికి కొంత డబ్బిచ్చి, కొన్ని బీరు బాటిళ్లు కానుకగా ఇచ్చి, తన భార్య ఫోన్లోని టెక్స్›్ట మెసేజీలు సంపాదించాడు. ఆ సంగతి ఇప్పుడు బయట పడింది. భార్యను అనుమానించినందుకు అతడికేమీ శిక్ష పడలేదు కానీ... లాయర్ని లంచాలతో ప్రలోభపెట్టినందుకు ఫెడరల్ కోర్టు అతడిని దోషిగా నిర్థారించింది. నేడో, రేపో శిక్ష. ఆర్నాల్డ్ ఆగ్డెన్ జోన్స్ (మిమ్మల్ని చూస్తున్న వ్యక్తి)
అరుదైన హిట్లర్ ఆల్బమ్
జర్మనీ నియంత హిట్లర్ ఫ్యామిలీ ఆల్బమ్ ఒకటి ఇటీవల వేలానికి వచ్చింది. 1945లో ఆయన బెడ్రూమ్లో బయట పడిన ఈ ఆల్బమ్ గురించి ఇంతవరకు ప్రపంచానికి తెలియదు. ఆయన దీర్ఘకాల సహచరి (భార్య అనుకోవచ్చు) ఈవా బ్రాన్, ఆయన ఆ బెడ్రూమ్లోనే ఉండేవారు. ఆనాటి ఫొటోలు ఉన్న ఈ ఆల్బమ్‌ను గతవారం యు.కె.లోని కెంట్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేశారు. 18,340 డాలర్లు (మన రూపాయల్లో సుమారు 12 లక్షలు) పలకొచ్చని అనుకున్నారు. చివరికి ఎంతకు అమ్ముడు పోయిందో వివరాలింకా విడుదల కాలేదు.
దొరికితే బాగుండు
వరుడు ట్రెండీ కింగ్, వధువు జేమ్స్ గ్యాలీ... పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి పత్రికలు పంచిపెట్టారు. ఇళ్ల బయట మనలాగే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పైకి లేపారు. పెళ్లి మంటపానికి దారి ఇదే అని బోర్డు కూడా పెట్టించారు. అప్పుడు మాయమైపోయాడు థియో! థియో ఈ వధూవరుల లవ్ పెట్. బ్రసెల్స్ గ్రిఫన్ జాతి కుక్కపిల్ల. అది తప్పిపోవడంతో ఇద్దరూ అప్సెట్ అయ్యారు. పెళ్లి ఆపేసుకున్నారు. ఇద్దరూ కలిసి థియో కోసం ఇప్పుడు భూమండలం అంతా వెదుకుతున్నారు. థియో ఫిబ్రవరి 13న తప్పిపోయింది. దానిని వెతికి తెచ్చినవారికి 3,500 డాలర్ల బహుమానం కూడా ప్రకటించారు. పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. డిటెక్టివ్‌లను కూడా పెట్టారు. ‘థియో దొరికితేనే ఎప్పటికైనా మా పెళ్లి’ అంటున్నారు. మనిషికి, కుక్కకు ఉండే అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. కానీ ఇలాంటి సంఘటనల్లో తెలుస్తుంది.
పదకొండేళ్ల చిట్టితల్లి!
‘సాక్షి’లో నిన్న ఒక వార్త వచ్చింది. 18 ఏళ్లకు ముందే తల్లులు అవుతున్నవారు మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రా, తెలంగాణాల్లో ఎక్కువగా ఉన్నారట! ఇది మంచి పరిణామం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి.. వార్తల్లోకి వచ్చిన ఓ ‘చిట్టి తల్లి’ గురించి చెప్పుకుందాం. ఆ తల్లిది లండన్. ఇంకా తల్లి కాలేదు. కాబోతోంది. ఆ చిట్టి తల్లి కనుక పండంటి బిడ్డకు జన్మనిస్తే... బ్రిటన్‌లోనే అతి చిన్నవయసులో బిడ్డను కన్న తల్లిగా రికార్డులలోకి ఎక్కుతుంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకు ఉన్న రికార్డు ఓ పన్నెండేళ్ల తల్లి పేరు మీద ఉంది! 2014లో ఆ తల్లి ప్రసవించింది. తండ్రికి కూడా అప్పుడు పెద్ద వయసేం కాదు 13 ఏళ్లు. అలా వాళ్లు అతి చిన్న వయసు తల్లిదండ్రులుగా కూడా కంబైన్డ్ గా రికార్డులకు ఎక్కారు. ఇప్పుడీ లేటెస్టు చిట్టితల్లి ప్రసవిస్తే 11 ఏళ్లకే తల్లయిన చిన్నారిగా రికార్టు నమోదు అవుతుంది. రికార్డుల నమోదుకైతే ఇదీ ఒక రికార్డు అవుతుందేమో కానీ, ఆ చిట్టి తల్లికి మాత్రం చాలా దుర్భరమైన కష్టం. ఏ అమ్మాయికీ రాకూడని కష్టం.
అడ్డొస్తోందని కాల్చేశారు
మనుషులకు తొందర ఎక్కువై, సహనం తగ్గుతోంది. న్యూజీలాండ్‌లోని ఆక్లండ్ ఎయిర్‌పోర్టులో ఈ మధ్య విమానాల టేకాఫ్ కొద్దిగా అలస్యం అవుతోంది. అందుకు కారణం ఆ పరిసరాలకు బాగా అలవాటు పడిన ఓ శునకం. ఇంటి యజమాని బయటికి వెళుతుంటే... నేనూ వస్తానని పెంపుడు కుక్క అడ్డుపడిన విధంగా... ఏదైనా ఒక విమానం బయల్దేరబోతోందీ అంటే ఈ శునకం తోక ఊపుకుంటూ పరుగున రన్‌వే మీదకు వచ్చేస్తోంది. దాన్ని సముదాయించి, పక్కకు తరిమేశాక కానీ రన్‌వే క్లియర్ కావడం లేదు. నిజానికైతే ఇదేం పెద్ద సమస్య కాదు. యానిమల్ ప్రొటెక్షన్ వాళ్లకు ఓ ఫోన్ కాన్ కొడితే వాళ్లొచ్చి ప్రేమగా తీసుకెళ్లిపోతారు. కానీ అంత ఓపిక ఈ కాలంలో ఎవరికుందీ! ‘ఏంటయ్యా... ఈ చికాకు’ అని ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లొచ్చి, గన్ తీసి, ఫట్ మని... పాపం ఆ కుక్కను కాల్చిపడేసి వెళ్లిపోయారు. రన్‌వే మీద విమానాలు ఎప్పటిలా టైమ్కైతే బయల్దేరుతున్నాయి కానీ... కుక్క లేని లోటు ఇప్పుడు విమానాశ్రయ సిబ్బందికి స్పష్టంగా కనిపిస్తోందట!
యుద్ధకాలపు యోధుడితడు
మానవులకు, మూగజీవులకే కాదు.. మృతదేహాలకూ హక్కులుంటాయి! ఆర్కాన్సాస్‌లోని ఒక పొలంలో మార్చి 5న ఓ సూట్‌కేస్ బయటపడింది. అందులో 89 ఏళ్ల ఒక వృద్ధుడి మృతదేహం ఏమాత్రం మర్యాద, గౌరవం లేని విధంగా కుక్కేసి ఉంది. ఆనవాళ్లను బట్టి, ఆ చనిపోయిన వ్యక్తిని ప్రపంచ యుద్ధంకాలం నాటి యోధుడిగా పోలీసులు గుర్తించారు. అతడిది న్యూయార్క్ అనీ, అతడి పేరు రాబర్ట్ బ్రూక్స్ అనీ తెలుసుకున్నారు. ఇక తెలుసుకోవలసింది ఆ పండుటాకును ఎవరు, ఎందుకు అంత నిర్లక్ష్యంగా సూట్‌కేస్‌లో కుక్కి, పొలాల్లో పడేశారన్నదే. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై మృతదేహాన్ని అగౌరవపరిచారన్న కేసు పెట్టి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
Will You Marry Me?
ఇంతకన్నా రొమాంటిక్ ప్రపోజల్ ప్రపంచంలో ఇంకొకటి ఉండి ఉండదు! టిమ్చీ, క్యాండిస్ భార్యాభర్తలు. ఉండడం ఆస్ట్రేలియా. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. పెళ్లికు ముందు మూడేళ్లు డేటింగ్లో ఉన్నారు. ఆ మూడేళ్లలో టిమ్చీ తన ప్రియురాలు క్యాండిస్కి 14 ప్రేమలేఖలు రాశాడు. ఇక పెళ్లికి ప్రపోజ్ చెయ్యడం ఒక్కటే మిగిలింది. Will you marry me అని అబ్బాయి అమ్మాయిని అడగాలి. అడిగాడు! ఎలా అడిగాడో చూడండి. క్యాండిస్ని సర్ప్రైజ్ హాలిడేకి తీసుకెళ్లాడు. వచ్చేటప్పుడు తను రాసిన పద్నాలుగు ప్రేమలేఖల్నీ తీసుకురమ్మని చెప్పాడు. ఆ అమ్మాయి భయపడింది! ఇదేంటీ ప్రేమ క్యాన్సిల్ అని చెప్పి, ఆ లెటర్స్‌ని చింపేస్తాడా అనుకుంది. అయినా తీసుకెళ్లింది. ఇద్దరూ ఓ కొండపై కూర్చున్నారు.
తన ప్రేమలేఖల్ని బయటికి తియ్యమని చెప్పాడు అబ్బాయి. బిక్కుబిక్కుమంటూ వాటిని హ్యాండ్ బ్యాగ్‌లోంచి తీసింది అమ్మాయి. అబ్బాయి నవ్వాడు. ఆ లేఖల్లోని మొదటి లెటర్స్ అన్నీ కలిపి చదవమని అడిగాడు. చదివింది అమ్మాయి. చదవగానే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. అక్షరాలన్నీ కలిపి చదివితే Will you marry me అన్న వాక్యం వచ్చింది. వెంటనే అబ్బాయిని అమ్మాయి కౌగలించుకుంది. ఇప్పుడీ దంపతులు ఆ మధుర స్మృతులను లోకానికి వెల్లడించారు. అలా ఈ విషయం మనకూ రీచ్ అయింది. దటీజ్ లవ్.