యానాం పోవాలా.. ఈఫిల్ చూడాలా...!
యానాం: విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ చూడాలనుకుంటున్నారా... అయితే యానాం పదండి. ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉంది. యానాం ఎందుకు అంటారా. అచ్చుగుద్దినట్టు ఈఫిల్ టవర్ ను పోలిన కట్టడాన్ని యానాంలో నిర్మించారు. స్థానిక గిరియాంపేటలో నిర్మించిన ఈ కట్టడానికి ఒబిలిస్క్టవర్ (యానాం టవర్)గా నామకరణం చేశారు.
12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. కింది అంతస్థులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్ట్ లో వెళ్లొచ్చు. 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని డిజైన్ చేశారు.
యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎ.అజయ్ కుమార్ సింగ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. పర్యాటకులను ఒబిలిస్క్టవర్ విశేషంగా ఆకట్టుకోనుంది. మీరు చూడాలనుకుంటే యానాంకు పయనం కట్టండి.