ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్‌ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ⇒ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ⇒ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. ⇒అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. ⇒మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. ⇒టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. ⇒ప్రీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. ⇒ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది.ఊబకాయం ఇలా..⇒ జంక్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ⇒జంక్‌ఫుడ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. ⇒ కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. ⇒ టీవీ, సెల్‌ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ⇒ తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్‌ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురంజీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్‌కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ఇలా చేస్తే మేలు.... జంక్‌ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి టీవీ, సెల్‌ఫోన్ చూసే సమయం తగ్గించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించాలి