1,500 మంది మహిళలను వేధించాడు..
న్యూఢిల్లీ: ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా 1,500 మంది మహిళలకు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ, మెసేజ్ ల రూపంలో బూతులను పంపుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
రంగంలోకి దిగిన పోలీసులు వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా బలిమారన్ ప్రాంతంలో ఓ షాపు రన్ చేసే మహమ్మద్ ఖలీద్ గా గుర్తించారు. మహిళలకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపి గుర్తించడానికి వీలు లేకుండా వెంటనే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తాడని వివరించారు. నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా మూడు సిమ్ కార్డులను ఉపయోగిస్తూ గత ఏడాదిగా 1,500 మంది మహిళలను వేధించినట్లు తెలిపారు. వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడి సిమ్ కార్డుల్లో దాదాపు 2,000 మంది ఫోన్ నంబర్లు ఉన్నాయని వాటిలో 1,500 నంబర్లకు తరచూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపినట్లు చెప్పారు.
కేసు విచారణ ఒక దశలో ఖలీద్ దొరికే అవకాశం లేదని భావించామని, అదే సమయంలో ఖలీద్ నంబర్ నుంచి జార్ఖండ్ లోని మహిళకు ఫోన్ చేయడంతో అతన్ని గుర్తించినట్లు తెలిపారు. అతని ఇంటి నుంచే ఈ ఫోన్లు రావడం గుర్తించిన పోలీసులు బృందంగా ఏర్పడి వలపన్ని ఖలీద్ ను పట్టుకున్నారు. ఖలీద్ దగ్గర ఉన్న సిమ్ కార్డులన్నీ చాందినీ చౌక్ లోని మొబైల్ షాపుల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెప్పారు. ఈ నెంబర్లకు తరచూ ఖలీద్ రీచార్జ్ లు చేయించినట్లు కూడా గుర్తించినట్లు చెప్పారు.
విచారణలో ఖలీద్ చెప్పిన విషయాలను విన్న పోలీసులు నివ్వెరపోయారు. రోజుకు 25 నుంచి 30 మంది మహిళలను వేధిస్తాడని నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. అతను చెప్పినట్లు వినకపోతే ఫోన్ నంబర్లు, ఫోటోలను ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించేవాడని చెప్పారు. ఖలీద్ కు పెళ్లి చూపుల సమయంలో వివాహం చేసుకోనని కొంతమంది అమ్మాయిలు నిరాకరించడం వల్లే మహిళలను వేధించడం ప్రారంభించినట్లు వెల్లడించారు. బాధితులకు సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఖలీద్ వద్ద ఉన్నాయేమోనని అన్వేషిస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసినట్లు విచారణలో వెల్లడైతే టెలికాం ఆపరేటర్లకు 50 వేల జరిమానా ఉంటుందని వివరించారు.