పోటాపోటీగా.. పంటల పరిశీలన
గత వారం రోజులుగా అకాలవర్షం, వడగళ్ల వానతో అతలాకుతలమైన కరీంనగర్ జిల్లా బుధవారం రాజకీయ నేతల తాకిడితో ఉక్కిరిబిక్కిరైంది. పంటనష్టం పరిశీలన పేరుతో అధికార, విపక్ష పార్టీల నేతలు ఉన్నట్లుండి ఒకేరోజు క్షేత్రస్థాయి పర్యటనల పేరుతో పోటీపడ్డారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతుల గోడు విన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు హమీ ఇస్తే...
కేంద్రం తరపున రైతులకు సత్వర సాయం అందించేందుకు యత్నిస్తానని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మల్యాల మండలంలో పంటలను పరిశీలించిన సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి రైతాంగానికి కేంద్రం ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో... రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని జతచేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :వాస్తవానికి కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ జిల్లా పర్యటన మాత్రమే తొలుత అధికారికంగా ఖరారైంది. జగిత్యాల, మేడిపల్లి మండలాల్లో తదితర ప్రాంతాల్లో పర్యటించేందుకు బుధవారం ఉదయమే కరీంనగర్‌కు వచ్చా రు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు బుధవారం ఉదయం మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావులతో సమావేశమయ్యారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో బీజేపీ కంటే ముందే పర్యటించడం మేలని, లేనిపక్షంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడే మంత్రులు ఈటెల, కేటీఆర్ సహా జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కె.విద్యాసాగర్‌రావు, సిహెచ్.రమేష్‌బాబు తదితరులు జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్గల్, మేడిపల్లి మండలం కట్లకుంట, కోరుట్ల మండలం జోగిన్‌పల్లి, మాదాపూర్ గ్రామాల్లో పర్యటించారు. మరో మంత్రి హరీష్‌రావు చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి పెగడపల్లి మండల కేంద్రం, ఏడుమోటలపల్లి గ్రామాల్లో పంటలను పరిశీలించారు.
తలపట్టుకున్న అధికారులు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ కోసం ఎదురుచూస్తున్న అధికారులకు అదే సమయంలో రాష్ట్ర మంత్రులు ఈటెల, కేటీఆర్, హరీష్‌రావు వస్తున్నట్లు ఆకస్మికంగా సమాచారం రావడంతో ఎటువైపు వెళ్లాలో తెలియక ఇబ్బందిపడ్డారు. చివరకు జగిత్యాల సబ్‌కలెక్టర్ కృష్ణభాస్కర్, ఉద్యానవన అధికారులు రాష్ట్ర మంత్రులతోపాటు నర్సింగాపూర్‌కు వచ్చారు. అక్కడ పంటలను పరిశీలిస్తున్న సమయంలో దత్తాత్రేయ జగిత్యాలలోని ఎస్సారెస్పీ గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. రాష్ట్ర మంత్రులిరువురు దత్తాత్రేయను కలవకుండానే నేరుగా చల్గల్ వెళ్లిపోయారు. వారితోపాటు అధికారులూ వెళ్లారు.
అక్కడినుంచి మేడిపెల్లికి వెళుతుండగా దత్తాత్రేయ కాన్వాయ్ ఎదురుపడడంతో ఆగిన రాష్ట్ర మంత్రులు తమ వాహనాలు దిగి దత్తాత్రేయతో కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు. రాష్ట్ర మంత్రులు వెళ్లిన తరువాత దత్తాత్రేయ చల్గల్, తాటిపల్లి గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతుల గోడు విన్నారు. కేంద్రం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మేడిపెల్లి మండలం పోరుమల్ల, తొంబర్రావుపేట, కలికోట గ్రామాల్లో పంటలను పరిశీలించిన అనంతరం కోరుట్ల మీదుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు మరికొందరు అధికారులు మాత్రం కేంద్ర మంత్రి వెంటే ఉన్నారు.
సాయంత్రం కాంగ్రెస్ నేతల పరిశీలన
కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లాలో పర్యటించి వెళ్లడంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ తదితరులు మ ల్యాల మండలం మానాల గ్రామానికి వెళ్లి వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరామర్శించారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కేంద్రం సైతం తక్షణమే అధికారుల బృందాన్ని జిల్లాకు పంపాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ విమర్శల దాడి
పంటనష్టం జరిగి సుమారు వారం రోజులు అవుతున్నప్పటికీ జిల్లా మంత్రులు ఇంతవరకు ఎందుకు పర్యటించలేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. దత్తాత్రేయతో కలిసి జిల్లాకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరీంనగర్, చల్గల్ ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వారం రోజులుగా రైతులు అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర మంత్రులు ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తుంటే అడ్డుతగులుతూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంటనష్టం జరిగి వారం రోజులు గడుస్తున్నా గ్రామాల్లో ఎందుకు తిరగలేదని ప్రశ్నించారు.
సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు జగిత్యాల డివిజన్ రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పడంతోపాటు వెంటనే పర్యటించాలని కోరానని తెలిపానన్నారు. అయినప్పటికీ పట్టించుకోని రాష్ట్ర మంత్రులు హడావుడిగా జగిత్యాలకు వచ్చి వెళ్లడం సరికాదు. ప్రొటోకాల ప్రకారం మంత్రులు పర్యటనల సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ జగిత్యాల పర్యటన సందర్భంగా తనకు ముందస్తుగా సమాచారం ఇచ్చారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత వారం రోజులుగా వర్షాలతో రైతుల నష్టపోతే కనీసం వివరాలను సేకరించే విషయంలోనూ టీఆర్ఎస్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు.