బంగాళా ఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఫలితంగా నాలుగు రోజులుగా వడగాడ్పులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతల్లో కొద్దిపాటి తగ్గుదల కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే నాలుగు రోజుల నుంచి వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తున్న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వాటిని ఉపసంహరించింది.
గడచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పులు వీచాయి. బుధవారం కూడా పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. కావలి, ఒంగోలు, తిరుపతిల్లో 40 డిగ్రీలు, మచిలీపట్నం, బాపట్ల, నెల్లూరులో 39 డిగ్రీలు, విశాఖపట్నం, కాకినాడ, తుని, కర్నూలుల్లో 38 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవి సాధారణంకంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికం. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.