Ocean Organics
-
సముద్రాల గుట్టు ఛేదించే ‘మత్స్య యంత్రం’
మన దేశానికి 7,500 కిలోమీటర్లకుపైగా సముద్ర తీరం ఉంది. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం.. మూడూ మూడు దిక్కుల్లో ఆవరించి ఉన్నాయి. ఎంతో మత్స్య సంపదకు, మరెన్నో వనరులకు, చిత్రవిచిత్రాలకు సముద్రాలు పుట్టినిల్లు. వాటి అడుగున ఉండే చిత్రవిచిత్రాలూ ఎన్నో. ఈ క్రమంలోనే సముద్ర అడుగున పరిశోధనలు, వనరుల వెలికితీత కోసం భారత్ ‘సముద్రయాన్’ప్రాజెక్టును చేపట్టింది. ఆ వివరాలేమిటో చూద్దామా.. సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమేగాకుండా ఖనిజాలు, మూలకాలు వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని గుర్తించడం, వెలికితీసి వినియోగించుకోవడం.. సముద్ర ఆధారిత ఎకానమీని అభివృద్ధి లక్ష్యంగా భారత్ ‘డీప్ ఓసియన్ మిషన్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగే ప్రత్యేక వెహికల్స్‌ను, సాంకేతికలను అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలతో కలిసి పనిచేయనుంది. ఆరు వేల మీటర్ల అడుగుకు వెళ్లగలిగేలా.. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా.. సముద్రాల అడుగున మానవ సహిత ప్రయోగాల కోసం ప్రత్యేకమైన వాహనాన్ని (డీప్ వాటర్ సబ్ మెర్సిబుల్ వెహికల్)ను భారత్ అభివృద్ధి చేయనుంది. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆరు వేల మీటర్ల (ఆరు కిలోమీటర్లు) లోతుకు వెళ్లి పరిశోధనలు చేయగలిగేలా దాన్ని రూపొందిస్తున్నారు. అందులో వివిధ సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు, సముద్రం అడుగున తవ్వడం, కదిలించడానికి వీలయ్యే ఉపకరణాలు ఉంటాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించనున్నారు. మత్స్య 6000 పేరుతో.. ► ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ‘మత్స్య 6000’పేరుతో డీప్ వాటర్ వెహికల్ ప్రాథమిక డిజైన్‌ను రూపొందించారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్ వాటర్ వెహికల్‌ను సిద్ధం చేయడానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ► సముద్రాల అడుగున అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నీటి సాంద్రత, విజిబిలిటీ వంటివి భిన్నంగా ఉంటాయి. వీటిని తట్టుకునేలా డీప్‌వాటర్ వెహికల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఆ లోతుల్లో పనిచేసే సెన్సర్లు, పరికరాలను, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉండనుంది. ► మొదట ఈ ఏడాది చివరినాటికి 500 మీటర్ల లోతు వరకు వెళ్లే డీప్ వాటర్ వెహికల్‌ను రూపొందించనున్నారు. 2024 మార్చి నాటికి పూర్తిస్థాయి ‘మత్స్య 6000’వాహనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► సముద్రాల్లో వెయ్యి మీటర్ల నుంచి 5,500 మీటర్ల లోతు వరకు గ్యాస్ హైడ్రేట్లు, మాంగనీస్, సలై్ఫడ్లు, కోబాల్ట్ వంటి ఖనిజాలు లభిస్తాయి. వాటిని వెలికితీసే అవకాశాలను ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ► ‘మత్స్య 6000’సాయంతో దేశం చుట్టూ ఉన్న సముద్రాల అడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. సముద్రాల్లో మునిగిన ఓడలు, ఇతర వస్తువుల పరిశీలన సేకరణ, నీటి అడుగున ఫైబర్ కేబుళ్లు, ఇతర పరికరాల ఏర్పాటు, మరమ్మతులకు దీనిని వినియోగించుకోనున్నారు. ఇదీ చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
మందు బిళ్లలు కాదు.. ‘సుద్ద’ బిళ్లలే..
* ఔషధ మూలకాలేవీ లేని 56 రకాల మందులు * కర్నూలులో ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో కదిలిన డొంక * సుద్దముక్కలు, కట్‌చేసిన రాళ్లకు అందమైన ప్యాకింగ్ * హైదరాబాద్ ల్యాబ్ పరీక్షల్లో బట్టబయలు * హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘ఓషన్ ఆర్గానిక్స్’ నుంచి దిగుమతి సాక్షి, హైదరాబాద్: డాక్టర్ చీటీ రాయగానే ఎంతో నమ్మకంగా మందులు కొనుక్కుని వేసుకుంటాం. అంతేగానీ అవి అసలైనవేనా.. నకిలీవా.. అనేది పట్టించుకోం. ఇంతకీ మనం మందులు మింగుతున్నామా? వాటి పేరిట ఎందుకూ పనికిరాని సుద్దబిళ్లలు మింగుతున్నామా? ఎందుకంటే.. ఔషధ నియంత్రణ అధికారుల నిర్లక్ష్యంతో నకిలీ మందులు మార్కెట్లోకి విచ్చలవిడిగా ప్రవేశిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. ఒక వినియోగదారుని ఫిర్యాదుపై స్వాధీనం చేసుకున్న కొన్ని రకాల ఔషధాలు పూర్తిగా నకిలీవని తేలడంతో ఔషధ నియంత్రణ అధికారులు నిర్ఘాంత పోయారు. ఒకే కంపెనీకి చెందిన 56 రకాల మందులు పూర్తిగా నకిలీవని పరీక్షల్లో తేలింది. ఇప్పటికే అవి అనేక మందుల షాపుల్లో విరివిగా విక్రయిస్తున్న మందులు కావడం గమనార్హం. ఒంగోలు, కర్నూలు, కడప మందుల షాపుల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుద్ద బిళ్లలే..:ఆ మందుల్లో అస్సలు ఔషధ మూలకాల్లేవు. మొత్తం సుద్ద బిళ్లలు. కట్ చేసిన రాళ్లముక్కలే. వాటిని బ్రహ్మాండంగా ముస్తాబు చేసి మార్కెట్లోకి వదిలారు. కర్నూలులో ఒక వినియోగదారుడి ఫిర్యాదుతో కదిలిన ఔషధ నియంత్రణ అధికారులు ఆ ఔషధాన్ని సీజ్ చేసి పరీక్షించగా పూర్తిగా నకిలీదని తేలింది. దాంతో అనుమానం వచ్చి ఆ కంపెనీకి చెందిన అన్ని రకాల మందులను సీజ్ చేసి హైదరాబాద్‌లోని ఔషధ నియంత్రణ ల్యాబొరేటరీలో పరీక్షించగా భయంగొలిపే వాస్తవాలు బైటపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని రుద్రపూర్‌లో గల ఓషన్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందిన ఆ ఔషధాలన్నీ సుద్దముక్కలు, రాతిముక్కలేనని తేలింది. వాటిలో ఒక్కశాతమూ ఔషధ మూల కాలు లేవని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ ఔషధాల ను ఉత్పత్తి చేసిన కంపెనీపై ‘డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్’ ప్ర కారం కేసులు నమోదుచేశారు. రూ.5 లక్షల పెనాల్టీతో పాటు యజమానికి యావజ్జీవ శిక్ష పడొచ్చని అధికారులు చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి నకిలీలు..: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్స్ (ఔషధాల ముడి పదార్ధాలు) ఉత్పత్తి ఎక్కువగా ఉంది గానీ ఫార్ములేషన్ (మందులను మాత్రల రూపంలోకి మార్చడం) డ్రగ్స్ కంపెనీలు చాల తక్కువ. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి.... ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఔషధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. దాదాపు 70శాతం ఔషధాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్ లెసైన్సులు పొందడం చాలా సులభం. ఒకవేళ నకిలీలతో దొరికిపోయినా అక్కడ శిక్షలు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. దీంతో ఊరూపేరూలేని మందుల కంపెనీలు వందల్లో పుట్టుకొస్తుంటాయి. అవి తయారు చేసే మందులన్నీ దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అప్పుడప్పుడు ల్యాబ్‌లలో ఈ ఔషధాల బండారం బైటపడుతోంది కానీ అవి నాసిరకం అని తేలినా ఆ కంపెనీకి నోటీసులు మాత్రమే ఇచ్చి ఊరుకుంటున్నారు. తాజాగా నకిలీ ఔషధాలు కలకలం సృష్టించడంతో ఔషధ నియంత్రణ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వాసుపత్రులకు ఏటా రూ.200 కోట్లతో ఔషధాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రులలో సరఫరా కోసం ఏటా రూ.200 కోట్లతో ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. యాంటీబయాటిక్స్ వీటికి అదనం. ఇందులో 70 శాతం అంటే రూ.140 కోట్ల విలువైన మందులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి. అంటే కేవలం 30శాతం (అంటే రూ.60 కోట్లు) మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తయారైన మందులు సరఫరా అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఇస్తున్న మందుల్లో 70శాతం మందులు నకిలీవి ఉండే అవకాశం ఉందన్నమాట. మన ప్రజారోగ్య వ్యవస్థ ఏ మేరకు నాశనమైపోయిందో అర్ధం చేసుకోవచ్చు.