ఆమె నా భార్య కాదంటున్న ఎమ్మెల్యే కుమారుడు
ఒడిషా : తనను పెళ్లి చేసుకుని, కుమార్తె పుట్టిన తర్వాత సంబంధం లేదంటున్నాడని ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు భువనేశ్వర్ నుంచి మహిళా పోలీసులు మల్కన్‌గిరి వచ్చారు. ఫిర్యాదుదారు సఖిత మహకొడ తెలిపిన వివరాల ప్రకారం.. సబితను చెప్పువ ఎమ్మెల్యే సనాతన్ మహాకొడ కుమారుడు పంకజ్ మహాకొడ పెళ్లి చేసుకున్నారు.
రెండేళ్లుగా మల్కన్‌గిరిలోని డీఎన్కేలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె కవిత మహాకొడ ఉంది. సబిత తన భార్య కాదని అంటున్నాడని ఆమె భువనేశ్వర్‌లో మహిళ కమిషన్‌కు, మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణకు భువనేశ్వర్ నుంచి మహిళ పోలీసుల బృందం బుధవారం మల్కన్‌గిరి వచ్చింది.
మల్కన్‌గిరి ఆస్పత్రిలో విచారణ జరపగా మెడికల్ సర్టిఫికెట్లో భర్తగా పంకజ్ పేరు ఉంది. కుమార్తె కవిత జనన ధ్రువీకరణ పత్రంలో తండ్రిగా పంకజ్ పేరు నమోదై ఉన్నట్లు గుర్తించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తనకు న్యాయం చేయాలని సఖిత కోరుతోంది.