రేణుకా.. మజాకా
ఖమ్మం, సాక్షి ప్రతినిధి: పేదలు నిర్మించుకునే ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము అక్షరాలా రూ.75 వేలు! అయితే పేదల కోసం పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చే నేతల కార్యాలయాల కోసం అధికార పార్టీ ఖర్చు చేసేది మాత్రం లక్షల్లో!! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇదిగో ఈ ఉదాహరణ చూడండి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి ఖమ్మంలో కేటాయించిన క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు, అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం అక్షరాలా రూ.31 లక్షలు కేటాయించింది. ఈ నెల 17న ఈ మేరకు జీవో నెంబర్ 784 జారీచేసింది. కానీ ఆరోజు జీవో కాపీ తన వెబ్సైట్లో కనిపించకుండా సర్కారు జాగ్రత్తలు తీసుకుని రెండుమూడ్రోజుల తర్వాత దాన్ని బయటపెట్టింది.
ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యాలయానికి అదనపు హంగులకు నిధులు కేటాయించాలని జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇంతకుముందు పంపిన ప్రతిపాదనలను ఆ శాఖ ఉన్నతాధికారులు తిరస్కరించారు. సుమారు 12 ఏళ్ల క్రితం రూ.20 లక్షలతో నిర్మించిన ఆ భవనం బాగానే ఉందని, ఎలాంటి అదనపు హంగులు అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ రేణుకా చౌదరి అడగ్గానే.. ప్రభుత్వ ఆర్థికశాఖ ఏకంగా రూ.31 లక్షలు కేటాయించడం గమనార్హం.
జలగం నుంచి స్వాధీనం.. రేణుకకు కేటాయింపు!
ఖమ్మం ఖానాపురం హవేలీ వీడీవోస్ కాలనీలో ఆర్అండ్బీకి చెందిన భవనాల్లో ఈ భవనాన్ని కొన్ని నెలల వరకు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. దాన్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం రేణుకా చౌదరికి కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఆమె ఆ భవనంలోకి మారలేదు. భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించాలని అప్పుడే అందులోకి చేరతానని ఆమె అనడంతో అధికారులు ఆగమేఘాల మీద ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. వాస్తవానికి ప్రజాప్రతినిధులకు జిల్లాల్లో ప్రభుత్వ భవనాల కేటాయింపు ఉండదు. కానీ ఖమ్మంలో మాత్రం ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ భవనాల కేటాయింపు జరుగుతోంది. అత్యంత తక్కువ అద్దెకు విశాలమైన భవనాలను కేటాయిస్తున్నారు. రేణుకకు కేటాయించిన భవనానికి పెద్దగా మరమ్మతులు అవసరం లేదు. కానీ భవన మరమ్మతుల రూ.8 లక్షలు, అదనపు గదులు, సౌకర్యాల కోసం మరో రూ.23 లక్షలు కేటాయిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.
ఇక్కడి ఆర్అండ్బీ అధికారులు మాత్రం వచ్చిన సొమ్ముతో ఒక గది నిర్మిస్తామని... పైకప్పుకు మరమ్మతులు చేయిస్తామని అంటున్నారు. ఇంత సొమ్ము అవసరమా అని ప్రశ్నించగా.. ఈ భవనాలు ప్రభుత్వానివి కాబట్టి ఎప్పటికైనా ఉపయోగమేనని చెబుతున్నారు. అద్దె ఎంత నిర్ణయించారని అడగ్గా.. ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. రేణుకకు స్వాధీనం చేసి నెలలు దాటినా ఎందుకు అద్దె నిర్ణయించలేదనగా.. ‘‘ఆమె ఇంకా భవనంలోకి మారలేదు. అన్ని హంగులు ఏర్పాటు చేశాక అద్దె నిర్ణయిస్తాం’’ అని పేర్కొన్నారు.