పోలీసుల అదుపులో బుల్లెట్ సురేష్ ?
ఆయిల్ రమేష్ కూడా
చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
విచారణ కోసం చిత్తూరుకు తరలింపు!
సాక్షి, చిత్తూరు: పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ బుల్లెట్ సురేష్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొద్ది రోజు లుగా అజ్ఞాతంలో ఉన్న సురేష్ విదేశాలకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అక్కడ తమిళనాడు, ఆంధ్ర పోలీసుల జాయింట్ ఆపరేషన్‌కు చిక్కినట్లు సమాచారం. సురేష్‌తోపాటు మరో ఎర్రచందనం స్మగ్లర్ ఆయిల్ రమేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బుల్లెట్ సురేశ్‌పై 9 కేసులున్నాయి. కొంతకాలం గా టీడీపీ నేతల ఆశీస్సులతో తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినపుడు చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ నివాసంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సురేష్ కలిశారు. ఈ విషయంపై ఈనెల 17న ‘మర్మమేమిటి గోపాలా?’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
అలాగే 3 కేసులున్న వారిపై పీడీయాక్టు నమోదు చేయాలనే నిబంధన ఉందని, కానీ 9 కేసులున్నా బుల్లెట్ సురేష్‌ను పోలీసులు అరెస్టు చేయడం లేదని ఈనెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసుకవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పోలీసులు సురేష్‌పై ప్రత్యేక దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
సురేశ్ నేరచరిత్రను చెప్పే కేసులు ఇవే..
క్రైం నెంబరు నమోదైన స్టేషన్
62-2011 చిత్తూరు తాలుకా
18-2011 చిత్తూరు టూ టూన్
32-2011 భాకరాపేట
95-2010 యాదమరి
60-2012 చిత్తూరు వన్‌టౌన్
120-2012 చిత్తూరు వన్‌టౌన్
153-2012 ఆర్మ్యాక్టు
వీటితోపాటు మరో రెండు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.