గొప్ప విమర్శకుడు.... విలువైన విమర్శ...
మంచి పుస్తకం
సర్దేశాయి తిరుమలరావు ఆయిల్ టెక్నాలజీలో గొప్ప సైంటిస్ట్. ఆ రంగంలో ఆయన చేసిన కృషి, చేసిన ఆవిష్కరణలు, సమర్పించిన పత్రాలు జాతీయ స్థాయిలో ఆయనకు కీర్తి సంపాదించిపెట్టాయి. అయితే ఆయన తెలుగు సాహిత్య సారస్వత రంగాల్లో చేసిన కృషి మాత్రం మరుగున పడిపోయింది. రాయలసీమ నుంచి ఎదిగిన భంగోరె, రారా వంటి విమర్శకుల కోవలో విశేష కృషి చేసిన పండితులు సర్దేశాయి తిరుమలరావు. అనంతపురం పట్టణంలో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి, ప్రచారాలకు పటాటోపాలకు లొంగకుండా నిక్కచ్చి విమర్శతో తెలుగు సృజనను దిశా నిర్దేశంలో పెట్టడానికి కృషి చేశారాయన. తెలుగు సాహిత్యంలో మిగతా శాఖలు వృద్ధి చెందినంతగా విమర్శ వృద్ధి చెందలేదని అనేవారట ఆయన. తెలుగులో గొప్ప నాటకం ‘కన్యాశుల్కం’, గొప్పకావ్యం ‘శివభారతం’, గొప్ప నవల ‘మాలపల్లి’ అని అంటారు తిరుమలరావు.
1994లో ఆయన మరణించినా ఇన్నాళ్లకు ఆయన కృషినీ ఆయన రాసిన విమర్శనా వ్యాసాలనూ పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరిగింది. ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ పేరుతో తెచ్చిన ఆ పుస్తకంలో తెలుగు లిపి, వచన పద్యం, మినీ కవిత, వీరశైవం, సజీవ గణితం, సూఫీ తత్త్వం వంటి అనేక అంశాల మీద తిరుమలరావు విపుల వ్యాఖ్యానం ఉంది. కొలకోవ్ స్కీ రాసిన ‘మాడర్నిటీ ఆన్ ఎండ్లెస్ ట్రయల్’ సుదీర్ఘ వ్యాసానికి సర్దేశాయి చేసిన అనువాదం, చేసిన టిప్పణి ఆలోచనాపరులందరూ చదవాలి. ‘సత్యం శివం సుందరం’ అనడం అందరికీ తెలుసు. కాని ఆ మాటను అన్నదెవరు? సర్దేశాయి వ్యాసాన్ని చదవాల్సిందే. ఇలాంటివే ఇంకా ఎన్నో. ఒంటికి ఆహారం కాక బుద్ధికి ఆహారం వెతికేవారు తప్పక పరిశీలించాల్సిన పుస్తకం ఇది.
వెల:రూ.150/- ప్రతులకు: 9701371256