Oilseed production
-
గాంధీ బాటలో గానుగలు!
గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కలలు గన్నారు. అందుకు స్పష్టమైన కార్యాచరణకు ప్రజలను కదిలించారు కూడా. గ్రామ స్వరాజ్యం రావాలంటే ఆహార స్వరాజ్యం అతి ముఖ్యమని తేల్చి చెప్పారు. ఆహార స్వరాజ్య సాధనకు, పౌష్టికాహార లోపాన్ని పారదోలటంలో ఎద్దులతో నడిచే కట్టె గానుగలు గ్రామగ్రామాన నెలకొల్పుకోవటం కీలకమని గాంధీజీ నొక్కి చెప్పారు. సహజ రూపంలో స్వచ్ఛమైన నూనెను అందించే సాంప్రదాయ సాంకేతికత ఇది. నూనె గింజలను పండించే రైతులు కట్టె గానుగలను ఏర్పాటు చేసుకొని నాణ్యమైన వంట నూనెలను ప్రజలకు అందించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రసాయనిక అవశేషాల్లేని సహజ ఆహారానికి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ రోజుల్లో గాంధీజీ 150వ జయంత్యుత్సవాల స్ఫూర్తితో కట్టె గానుగ నూనెల ఉత్పత్తి, వాడకంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించాలి. అతి నెమ్మదిగా తిరిగే కట్టె గానుగల ద్వారా వెలికి తీసే నూనె(అందుకే దీన్ని ‘కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్’ అంటారు) అత్యంత పోషక విలువలతో కూడి ఉంటుందని, దీని వాడకం ఎంతో ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ హయాంలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కూడా పల్లెలు, పట్టణాల్లో మోటారుతో నడిచే కట్టె గానుగ నూనె ఉత్పత్తి కేంద్రాల వ్యాప్తికి సాంకేతిక పరంగా, ఆర్థికపరంగా తోడ్పడుతుండటం విశేషం. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద మోటారుతో నడిచే కట్టె గానుగల ఏర్పాటుకు కె.వి.ఐ.సి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలకు శిక్షణ, సాంకేతిక సహాయంతోపాటు సబ్సిడీని కూడా అందిస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన నూనెలు అందిస్తున్నా! గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్య సాధన క్రమంలో ముఖ్య భూమిక పోషించే కొన్ని అంశాల్లో ఎద్దు గానుగ ఒకటి. ఎద్దులతో తిరిగే కట్టె గానుగలు తిరగడానికి విద్యుత్తు అవసరం లేదు. ఎంత మారుమూల గ్రామంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎద్దు గానుగలు గ్రామంలో ఉంటే.. అక్కడ పండించిన నూనె గింజలతో ఎక్కడి వారు అక్కడే ఆరోగ్యదాయకమైన వంట నూనెలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నూనె అందించవచ్చు. ఎద్దు గానుగ ద్వారా గ్రామంలోనే ఇద్దరు మనుషులకు, రెండు దేశీ జాతి ఎద్దులకు పని కల్పించవచ్చు. ఎద్దులను కబేళాలకు తోలకుండా ఆపొచ్చు. స్వాతంత్య్రానికి పూర్వం మన గ్రామాల్లో గానుగలు విరివిగా ఉండేవి. క్రమేణా యాంత్రీకరణ, కేంద్రీకృత వ్యవస్థ అమల్లోకి రావడంతో గానుగలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బజారులో రంగు, రుచి, వాసన, పోషకాలు పుష్కలంగా ఉండే మంచి నూనెలు దొరకడం గగనం అయ్యింది. డా. ఖాదర్ సూచన ప్రకారం మంచి నూనెలను ప్రజలకు అందించాలన్న సంకల్పంతో నేను ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి పలికి రైతుగా మారాను. రెండు ఎద్దు గానుగలను ప్రారంభించాను. సిరిధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజలను సాగు చేయనారంభించాను. వీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గానుగ నూనెలను నేరుగా ప్రజలకు అందిస్తున్నాను. – బసవరాజు (93466 94156), మహబూబ్‌నగర్ కట్టె గానుగల నిర్వహణపై కెవిఐసి శిక్షణ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్, కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి చేయూతనిస్తుంది. స్వదేశీ పరిజ్ఞానంతో గ్రామీణ/పట్టణ ప్రాంతాల్లో గానుగ నూనె పరిశ్రమను స్థాపించవచ్చు. గానుగ నూనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గానుగ ద్వారా తీసిన నూనె, దాని సహజ పోషకాలు, అసలు రుచి, రంగు, విటమిన్లు కలిగి ఉంటుంది. ఎక్స్పెల్లర్ నుంచి తయారు చేసిన వంట నూనెతో పోల్చినప్పుడు గానుగ నూనె ఇంకా మంచి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది స్వచ్ఛమైన, సహజ రూపంలో నూనెను అందించే సాంప్రదాయ సాంకేతికతను సంరక్షిస్తుంది. మోటారుతో నడిచే కట్టె గానుగ (పవర్ ఘని) ద్వారా వంట నూనెలను వెలికితీసే పనిలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) నామమాత్రపు ఖర్చుపై శిక్షణ ఇస్తుంది. మహారాష్ట్ర నాసిక్ నగరంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో ఈ శిక్షణ ఇస్తాం. శిక్షణ వ్యవధి 15 రోజులు. హాస్టల్ వసతి ఉంది. ప్రయాణ ఖర్చులను శిక్షణ పొందే వారే భరించాలి. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం(పిఎంఇజిపి) కింద మోటారుతో నడిచే కట్టె గానుగల (ఘనీ ఆయిల్ యూనిట్ల) ఏర్పాటుకు కె.వి.ఐ.సి. సాంకేతిక సహాయంతోపాటు సబ్సిడీ సహాయాన్ని కూడా అందిస్తోంది. మరిన్ని వివరాలకు తెలంగాణ వాసులైతే హైదరాబాద్ నాంపల్లిలో గాంధీ భవన్ ఆవరణలోని కె.వి.ఐ.సి. తెలంగాణ రాజ్య కార్యాలయ సిబ్బందిని సంప్రదించవచ్చు. ఫోన్ నంబరు.. 040 29704463. – వి. చందూల్, సంచాలకులు, కె.వి.ఐ.సి., హైదరాబాద్ – మాడుగుల హరి, సహాయ సంచాలకులు, కె.వి.ఐ.సి., హైదరాబాద్ ఆన్లైన్లోనే ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్/లైసెన్స్ గానుగలు పూర్వం చాలా ఉండేవి. ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయి. గానుగ నూనెలు మంచివే. నూనె గానుగలకు ప్రత్యేక రూల్సేమీ లేవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాథికార సంస్థ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ సంస్థ వెబ్సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చిన్న స్థాయిలో ఎద్దు గానుగ / మోటారుతో నడిచే కట్టె గానుగ పెట్టుకొని ఏడాదికి రూ. 12 లక్షల కన్నా తక్కువ అమ్మకాలు సాగించే వారైతే ఏడాదికి రూ. 100 చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. రూ. 500 చెల్లించి ఐదేళ్లకు ఒకేసారి రిజిస్ట్రేషన్ పొందవచ్చు. రోజుకు ఒక మెట్రిక్ టన్ను వరకు గానుగ నూనెను ఉత్పత్తి చేసే వారైతే ఏడాదికి రూ. 3 వేలు చెల్లించి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఐదేళ్లకు ఒకేసారి లైసెన్స్ పొందవచ్చు. ఆన్లైన్లో ధరఖాస్తు చేసిన తర్వాత వెరిఫికేషన్ అనంతరం 60 రోజుల్లో లైసెన్స్ మంజూరు చేస్తారు. ఏజెంట్ల అవసరం లేదు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు. – డా. కె. శంకర్, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా సంచాలకులు, హైదరాబాద్ www.fssai.gov.in తేమ తక్కువగా ఉంటే నిల్వ సామర్థ్యం ఎక్కువ ఎద్దు గానుగ నూనెలు పూర్వం నుంచి వాడుతున్నాం. ఈ నూనెలను వంటలకే కాకుండా వైద్యానికి కూడా వాడేవారు. గింజలు బాగా ఎండబెట్టి తేమ ఎక్కువగా లేని నూనె తీసుకుంటే, ఆ నూనెలు ఐదారు నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. నూనె గింజల నుంచి 32–40 శాతం నూనె వస్తుంది. కట్టె గానుగ నూనెలు తీసిన తర్వాత మిగిలే పిప్పిని కోళ్లకు, పశువులకు, రొయ్యలు/చేపలకు దాణాగా వాడుతున్నారు. నువ్వుల నూనె తీసిన తర్వాత మిగిలే తెలగపిండి ఆడవాళ్లలో ఎముకల పుష్టి కోసం, కాల్షియం లోపాన్ని, మోకాళ్ల నొప్పులను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. తెలగపిండిని బాలింతలకు కూరగా వండి పెడితే బిడ్డకు పాల కొరత ఉండదు. తీసిన నూనెలో తేమ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. – శివశంకర్ షిండే (98660 73174), కట్టె గానుగ నిర్వహణపై శిక్షకుడు, న్యూలైఫ్ ఫౌండేషన్, దమ్మాయిగూడ, సికింద్రాబాద్ కలుపు తీసే ‘పల్లె’ యంత్రాలపై వెబినార్ రేపు పంట పొలాల్లో కలుపు నిర్మూలనకు ఉపయోగపడే అనేక పరికరాలు, యంత్రాలను ఆవిష్కరించిన గ్రామీణ ఆవిష్కర్తలు అనేక మంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ ఆవిష్కరణల వివరాలు ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు తెలిసినవే. అయితే, ఆ ఆవిష్కర్తలతో నేరుగా ముచ్చటించి సందేహాలను నివృత్తి చేసుకునే సదవకాశం కల్పిస్తున్నాయి పల్లెసృజన, క్రియేటివ్ మైండ్స్ సంస్థలు. ఈ నెల 14 (బుధవారం)న ఉదయం 10.30 గంటలకు గూగుల్ మీట్లో ఉచిత వెబినార్ జరుగుతుంది. https://meet.google.com/min-tvyx-bpm ఈ లింక్ ద్వారా వెబినార్‌లో పాల్గొనవచ్చు. గ్రామాల్లో మరుగునపడి ఉండిన ఆవిష్కర్తలను గుర్తించి వెలుగులోకి తేవడానికి, వారికి ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సముచిత రీతిన పురస్కారాలు వచ్చేలా కృషి చేయటంలో బ్రిగేడియర్ పోగుల గణేశం, దుర్గాప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలోని పల్లెసృజన, క్రియేటివ్ మైండ్స్ సంస్థలు సుదీర్ఘకాలంగా విస్తృత సేవలు అందిస్తుండటం ప్రశంసనీయం. వివరాలకు: పల్లెసృజన సుభాష్ 9652801700 18న చిన్నవెలగటూరులో ప్రకృతి వ్యవసాయ శిక్షణ చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం చిన్న వెలగటూరు గ్రామంలోని తేజోవంతరెడ్డికి చెందిన శ్రీ సాయి ఫామ్‌హౌస్‌లో ఈ నెల 18 (ఆదివారం)న ప్రకృతి వ్యవసాయంపై అనంతపురానికి చెందిన సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 100. వివరాలకు.. 79956 15060, 98668 81878 18న నెమటోడ్స్, వరిలో కలుపు నివారణపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈ నెల 18న సహజ పద్ధతిలో ఆకు రసాలతో ఉద్యాన పంటల్లో నులిపురుగులు (నెమటోడ్స్) నివారణ, ఆకు రసాలతో వరిలో కలుపు నివారణపై శిక్షణ ఇవ్వనున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త, ఆవిష్కర్త గళ్లా చంద్రశేఖర్ రైతులకు శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. 40 మందికి మాత్రమే ప్రవేశం. రిజిస్ట్రేషన్ వివరాలకు 97053 83666, 0863–2286255. -
నూనె ఎక్కువేద్దాం!
సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వంట నూనెల కొరత ఏర్పడింది. నూనె గింజల సాగు తక్కువగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఉద్యానశాఖ అంచనా వేసింది. మన అవసరాలకన్నా 3 లక్షల టన్నులు తక్కువ ఉత్పత్తి ఉంది. మన దేశ అవసరాలకు 2.1 కోట్ల టన్నుల వంట నూనెలు అవసరం కాగా.. 70 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 1.4 కోట్ల టన్నుల నూనెను రూ.75 వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మొత్తం దిగుమతుల్లో 60 శాతం పామాయిల్ ఉండటం గమనార్హం. దేశంలో నూనె గింజల ఉత్పత్తి 2.52 కోట్ల టన్నులు కాగా, అందులో వంట నూనెల ఉత్పత్తి 70 లక్షల టన్నులుగా ఉంది. పైగా ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పాదకత కేవలం మూడో వంతు మాత్రమే. అందుకే ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటోంది. తెలంగాణలో 42 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేటల్లో సాగు చేస్తున్నారు. కానీ ఉత్పాదకత తక్కువగా ఉండటంతో ఉత్పత్తి పెద్దగా లేదు. దీంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ వంట నూనెల కొరత వేధిస్తోంది. కార్యాచరణ ప్రణాళిక.. పామాయిల్ సాగును పెంచడం ద్వారానే రాష్ట్రంలో వంట నూనెల కొరతను అధిగమించవచ్చని ఉద్యానశాఖ భావిస్తుంది. మరో 75 వేల ఎకరాలకు పామాయిల్ సాగు విస్తరిస్తే రాష్ట్రంలో నెలకొన్న 3 లక్షల టన్నుల వంట నూనెల కొరతను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న 4 జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకోసం వివిధ ప్రాంతాల్లో పామాయిల్ సాగుకు గల అనుకూలతలను అధ్యయనం చేస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. ఇప్పటికే పామాయిల్ సాగుకు అనువైన జిల్లాలను సర్వే చేయించామన్నారు. ఆ సర్వే ద్వారా కొత్తగా 18 జిల్లాల్లోని 206 మండలాల్లో 6.95 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఆ స్థాయిలో సాగు పెరిగితే అవసరాలు తీరడమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందన్నారు. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. క్రూడ్ పామాయిల్ రికవరీ శాతాన్ని రైతుల కోరిక మేరకు 18.94 శాతంగా నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇది 18.43 శాతంగా ఉంది. దీనివల్ల రైతులకు ఈ ఏడాది పామాయిల్ గెలలకు అధిక ధర లభించనుంది. -
వంటనూనెల మంట తీరేదెలా?
ప్రస్తుతం దేశంలో నూనెగింజల ఉత్పత్తికి సాగుచేస్తున్న 27.86 మిలియన్ హెక్టార్లలో కేవలం 7.5 శాతం భూమిని ఆయిల్‌పామ్ సాగుకు మళ్లించగలిగితే చాలు... వంటనూనెల సాగులో భారత్ స్వావలంబన సాధించగలుగుతుంది. అంతేకాదు రూ.50,000 కోట్ల దాకా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. వాణిజ్య సరళీకరణ ప్రభావం గత రెండు దశాబ్దాల్లో వంట నూనెలకు సంబంధించి భారత్‌కు ఘోరమైన అనుభవాలను మిగిల్చింది. ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్ల పుణ్యమా అని భారత్ వంటనూనెల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. 1992-93లో 0.1 మిలియన్ టన్నుల వంట నూనెలు మాత్రమే దిగుమతి చేసుకుంటే 2012-13 నాటికి ఆ పరిమాణం కాస్తా 10 మిలియన్ టన్నుల స్థాయికి పెరిగింది. మరోవిధంగా చెప్పాలంటే 2012-13లో మనం రూ. 50,000 కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకున్నాం. ఇదే ఆర్థిక సంవత్సరంలో భారత్ తనకు అవసరమైన వంటనూనెల్లో 57 శాతం మేరకు వంటనూనెలను దిగుమతి చేసుకుంది. మన దేశం ముఖ్యంగా ఇండోనేసియా, మలేసియాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవడం ద్వారా తన అవసరాలను తీర్చుకుంటోంది. 2012-13లో భారత వాణిజ్యలోటు రికార్డుస్థాయిలో 190.91 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం వ్యవసాయ దిగుమతుల్లో వంటనూనెల దిగుమతుల వాటా 1991-92లో కేవలం 6 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది 55 శాతానికి చేరుకుంది. ప్రత్యామ్నాయ వ్యూహాలు అవసరం మన దేశంలో 18 మిలియన్ టన్నుల వంటనూనె వినియోగం జరుగుతోంది. ఇందులో 45 శాతం పామ్ఆయిలే. ఇండియాలో వంటనూనెల వార్షిక తలసరి వినియోగం 1950లో మూడు కిలోలు ఉండగా 2010-11 నాటికి 14.2 కిలోలకు పెరిగింది. 2020 నాటికి ఇది గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోడానికి దిగుమతులపైనే అధారపడడం సంకుచిత ధోరణే అవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ టన్నులదాకా ఉన్న పామ్ ఆయిల్ డిమాండ్ 2020 నాటికి రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ చమురు ఎగుమతి దేశాలు దీనిలో గణనీయ వాటాను బయోఫ్యూయల్‌కు మళ్లిస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని అంచనా వేస్తున్నారు. చమురు గింజల ఉత్పత్తికి ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించుకోవడం ద్వారా రానున్న సంక్షోభాన్ని చక్కదిద్దవచ్చు. ఆయిల్ పామ్ సాగును విస్తరించడం చమురు రంగంలో సహజసిద్ధంగా పటుతరమైన మార్గమవుతుంది. వాస్తవానికి విస్తారంగా ఆయిల్‌పామ్ తోటలను పెంచుకోగలిగితే వంటనూనెల్లో మన దేశం స్వావలంబన సాధించగలుగుతుంది. ఇతర నూనె గింజలతో పోల్చితే ఆయిల్‌పామ్ నుంచి వచ్చే ఆయిల్ శాతం చాలా ఎక్కువ. ఉదాహరణకు ఆవగింజల నుంచి వచ్చే నూనె కన్నా ఆరు రెట్లు అధికంగానూ, వేరుశనగ(పల్లీ) గింజలకన్నా ఐదు రెట్లు అధికంగా ఆయిల్‌పామ్ నుంచి ఆయిల్‌ను రాబట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 33 శాతం వాటాతో పామ్ ఆయిల్ అగ్రస్థానంలో ఉంది. మందకొడిగా సాగు మన దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రవేశపెట్టి పాతికేళ్లయినా ప్రస్తుతానికి క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి 1,25,000 టన్నులకే పరిమితమయ్యింది. ఆయిల్ పామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గానీ, ఆయిల్‌పామ్ సాగువిస్తరణ కార్యక్రమం చెప్పుకోదగినస్థాయిలో ముందుకు సాగలేదు. దేశంలోని 15.80 మిలియన్ హెక్టార్లలో అనేక రకాల మిశ్రమ చమురు గింజల ద్వారా 4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేస్తున్నారు. అయితే అదే పరిమాణంలో పామ్‌ఆయిల్‌ను ఒక మిలియన్ హెక్టార్ విస్తీర్ణం నుంచే ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో 1.7 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ను సాగు చేస్తున్నారు. దీన్ని ఒక మిలియన్ హెక్టార్లలో సాగుచేసే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. ఆయిల్‌పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఒకవేళ అదనంగా 8 లక్షల హెక్టార్లను సాగులోకి తీసుకురాగలిగితే ప్రస్తుత ధరవరల ప్రకారం దిగుమతుల భారం రూ. 45,000 కోట్ల దాకా ఆదా అవుతుంది. ఆయిల్ పామ్ జీవితం సుమారుగా 25 ఏళ్లు అనుకుంటే...ప్రస్తుతం అమల్లో ఉన్న ధరల ప్రకారం రూ. తొమ్మిది లక్షల కోట్ల దాకా మొత్తానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదాచేయొచ్చు. సరియైన ధరను ఖరారు చేయడం ద్వారా ఆయిల్‌పామ్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ప్రస్తుతం నూనెగింజల ఉత్పత్తికి సాగుచేస్తున్న 27.86 మిలియన్ హెక్టార్లలో కేవలం 7.5 శాతం భూమిని ఆయిల్‌పామ్ సాగుకు మళ్లించగలిగితే చాలు... వంటనూనెల సాగులో భారత్ స్వావలంబన సాధించగలుగుతుంది. అంతేకాదు రూ.50,000 కోట్ల దాకా విదేశీ మారకద్రవ్యం ఆదా చేయగలుగుతుంది. రైతులకు దక్కని గిట్టుబాటు రేటు ఆయిల్‌పామ్ మద్దతు ధరపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రైతులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పర్యావరణకు సంబంధించిన భద్రత, రైతుల జీవనోపాధికి సంబంధించిన కోణంలో కూడా ఇది ఎంతో ముఖ్యమైనది. అయితే ఆయిల్‌పామ్ రంగంలో కొన్ని అసంబద్ధమైన పోకడలు ఉన్నాయి. ఆయిల్‌పామ్ సాగు ప్రాంతాలను కొన్ని జోన్లుగా విభజించి, రైతులు తమ ఉత్పత్తిని తమకు సంబంధించిన జోన్లో కేటాయించిన ప్రాసెసర్‌కే విధిగా అమ్మాల్సిన పరిస్థితి ఉంది. ఈ పాత పద్ధతిని రద్దు చేయాలి. తనకు హెచ్చు రేటు వచ్చే చోటు తన ఉత్పత్తిని అమ్ముకునే స్వేచ్ఛ రైతుకు ఇవ్వాలి. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రస్తుతం చెల్లిస్తున్న రేటు పరిశ్రమకు అనుకూలంగా, రైతులకు నష్టదాయకంగా ఉందని చెప్పకతప్పదు. ఇది సంప్రదాయ సాగు కాదు. అంతే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిమేరకు చిన్నరైతులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి దీన్ని వేస్తున్నారు. డబ్ల్యూటీవో ఒప్పందం తర్వాత అమల్లోకి వచ్చిన వంటనూనెల విధానం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో నిలకడ లేకుండా పోయింది. అంతేకాకుండా అంతర్జాతీయ ధరల వత్తిళ్ల ప్రభావంతో ఆయిల్‌పామ్ రైతులు తీవ్ర నష్టాలకు లోనయ్యారు. మార్కెట్ రేటుకూ, తాము పెట్టిన పెట్టుబడులకూ చాలా వ్యత్యాసం ఉండడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీనితో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని రైతులు ఆయిల్‌పామ్ పంటను తీసేశారని పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి. జాతీయ బోర్డు కావాలి ఆయిల్‌పామ్ సాగు అభివృద్ధికి ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది ఎంతో ఉంది. కొబ్బరి అభివృద్ధి బోర్డు మాదిరిగానే జాతీయస్థాయిలో ఆయిల్‌పామ్ అభివృద్ధి బోర్డును నెలకొల్పాలి. పామాయిల్ పౌష్టికాహారంగా కూడా ఉపయోగపడుతుంది. దీనికి ‘అమోఘమైన ఆయిల్’గా పేరుంది. మరోవైపు దీన్ని బయోఫ్యూయల్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. విదేశాలలో ఆయిల్‌పామ్‌ను బడా కంపెనీలు పెద్దస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి. కాని ఇండియాలో మాత్రం ఇది ఇంకా చిన్న కమతాల్లోనే సాగవుతోంది. ముఖ్యంగా భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో దారిద్య్ర నిర్మూలనకు ఆయిల్‌పామ్ సాగు ఒక శక్తిమంతమైన సాధనంగా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. - (వ్యాసకర్త విధాన విశ్లేషకులు) డాక్టర్ కె.క్రాంతి కుమార్ రెడ్డి