మరో స్ట్రీట్‌ఫైట్
- కొట్టుకున్న ఇంటర్ విద్యార్థులు
- బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఘటన
- విద్యార్థి కిడ్నాప్.. రక్షించిన పోలీసులు
బంజారాహిల్స్: పాతబస్తీలో స్ట్రీట్‌ఫైట్ జరిగి రెండు రోజులు గడవకముందే బంజారాహిల్స్‌లో అదే తరహా ఘటన జరిగింది. బంజారాహిల్స్ సినీమ్యాక్స్ వద్దకు రా.. తేల్చుకుందామంటూ ఓ విద్యార్థి తన స్నేహితుడికి సవాల్ విసిరాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఓ విద్యార్థి కిడ్నాప్‌కు దారితీసింది. వివరాలు... మదీనగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇటీవల ఓ విద్యార్థి(16) బైక్ నేమ్ ప్లేట్‌ను మరో విద్యార్థి ధ్వంసం చేశాడు. ఎందుకలా చేశావని నిలదీయగా నా ఇష్టం అంటూ అవతల విద్యార్థి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.
దీంతో బాధిత విద్యార్థి మంగళవారం బంజారాహిల్స్ వస్తే ‘ ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’ అని సవాల్ విసిరాడు. కొండాపూర్ నుంచి సదరు విద్యార్థి తన ఆరుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లోని లూసిడ్ ఆస్పత్రి గల్లీకి వచ్చాడు. అప్పటికే ఇంకో ఆరుగురు స్నేహితులతో వేచిఉన్న బాధిత విద్యార్థి గొడవకు దిగాడు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. నన్నే కొడతావా? నీ సంగతి చూస్తానని బాధిత విద్యార్థిని మరో విద్యార్థి కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి దూసుకుపోయాడు. మిగితా వారంతా భయపడి పోలీసుకు సమాచారం
ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు ఛేజింగ్ చేసి విస్పల్ వ్యాలీ సమీపంలో కారును అడ్డుకొని విద్యార్థిని రక్షించారు. కిడ్నాప్‌కు పాల్పడిన విద్యార్థినిఅదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
పాతబస్తీ ఘటనలో కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్
చాంద్రాయణగుట్ట: పాతబస్తీ ఫంజెషాలో ఈనెల 3న జరిగిన స్ట్రీట్ఫైట్తో ప్రమేయమున్న తొమ్మిది మంది నిందితుల కుటుంబ సభ్యులకు దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ కౌన్సెలింగ్ నిర్వహించారు. పురానీహవేళీలోని తన కార్యాలయానికి వారిని పిలిపించి స్ట్రీట్‌ఫైట్ కారణంగా జరిగిన ఘోరాన్ని వివరించారు. రాత్రిపూట పిల్లలు బయటికి వె ళ్తున్నా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రాత్రంతా పిల్లలు బయట తిరుగుతూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఎందుకు నిర్లక్ష్యం చేశారన్నారు. మీ నిర్లక్ష్యం ఫలితమే ఇప్పుడు మీ పిల్లలపై కేసులు నమోదయ్యే పరిస్థితికి దారి తీసిందని స్పష్టం చేశారు. స్ట్రీట్‌ఫైట్ కారణంగా నబీల్ మహ్మద్ మృతి చెందాడన్నారు. కాగా తొమ్మిది మంది నిందితుల్లో ఇద్దరు మినహా మిగతా వారంతా మేజర్లు అని మీర్‌చౌక్ పోలీసులు తెలిపారు. నిందితులపై 302, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఒవేస్ ఏకధాటిగా జరిపిన ముష్టిఘాతాలకు నబీల్ కణత భాగంలో బలమైన గాయాలై కోమాకు వెళ్లి మృతి చెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టమైందని పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు.