‘ఆదాయ’శాఖకు అధికారులు కరువు!
♦ వాణిజ్య పన్నుల శాఖలో 1,106 ఖాళీలు
♦ నేటికీ పాత డివిజన్లు, సర్కిళ్లవారీ పోస్టులు
♦ జీరో దందాపై తగ్గిన నిఘా
♦ కొత్త డీలర్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి
♦ విషయం సీఎం దృష్టికి... కదులుతున్న ఫైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయాన్నిచ్చే వాణిజ్యపన్నులశాఖకు అధికారులు, సిబ్బంది కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రం లో పోస్టులను జనాభా నిష్పత్తి ప్రకారం విభజిం చాక అధికారుల సంఖ్య గణనీయంగా తగ్గగా భర్తీ చేసుకునే ప్రయత్నాలేవీ జరగడం లేదు. దీంతో అక్రమ రవాణా, జీరో దందాపై నిఘా తగ్గడంతోపాటు కొత్తగా పన్నులు విధించేందుకు అవకాశాలున్న సంస్థలు, డీలర్లపై దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. వాణిజ్యపన్నులశాఖకు ఉమ్మడి రాష్ట్రంలో కమిషనర్, అదనపు కమిషనర్, సంయుక్త కమిషనర్ పోస్టులు కాకుండా 8,882 మంది అధికారులు, ఇతర ఉద్యోగులను కేటాయించారు.
రాష్ట్ర విభజన తరువాత జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 3,539 మందిని కేటాయించగా వీరిలో ప్రస్తుతం విధుల్లో 2,433 మందే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సీటీవో, డీసీటీవో, ఏసీటీవో వంటి కీలక పోస్టుల నుంచి ఆఫీస్ సబార్డినేట్ల వరకు 18 విభాగాల్లో ఏకంగా 1,106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియారిటీ జాబితా తయారీలో నిర్లక్ష్యం కారణంగా పదేళ్లుగా పదోన్నతులు లేవు. దీంతో 40 సీటీవో పోస్టులు, 50 చొప్పున డీసీటీవో, ఏసీటీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు 298 జూనియర్ అసిస్టెం ట్ పోస్టులు, 158 సీనియర్ అసిస్టెంట్, 254 ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
భారీగా డీలర్లు... పెరగని సర్కిళ్లు
వాణిజ్యపన్నులశాఖకు వచ్చే ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ పరిధిలోని 7 డివిజ న్ల నుం చే సమకూరుతోంది. టర్నోవర్ టాక్స్ (టీవోటీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చెల్లిస్తున్న టిన్ (టాక్స్ పేయర్స్ ఐడెంటిఫికేషన్ నంబర్) డీలర్లు హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది టిన్ రిజిస్ట్రేషన్ డీలర్లు ఉండగా వారిలో సికింద్రాబాద్ నోడల్ డివిజన్ (హైదరాబాద్ సిటీ) పరిధిలోని ఐదు డివిజన్లలో ఉన్న 43 సర్కిళ్లలోనే 56,980 మం ది డీలర్లు ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది డీలర్లకు ఒక సర్కిల్ ఉండాల్సి ఉండగా హైదర్‌నగర్‌లో 6,086 మంది, మాదాపూర్‌లో 6,323 మంది డీలర్లు రిజిస్టరై ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్‌లో 463 మంది, మహారాజ్‌గంజ్‌లో 468 మంది, రాంగోపాల్‌పేట్‌లో 443 మంది, హిస్సామ్గంజ్లో 496 మంది డీలర్లే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తక్కువ డీలర్లున్న సర్కిళ్లను కలపాలని, ఎక్కువ ఉన్న చోట కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
పరిస్థితి సీఎం దృష్టికి...
రాష్ట్ర ఖజానాకు ఈ వార్షిక సంవత్సరంలో రూ. 36 వేల కోట్ల ఆదాయం అందించాలని పెట్టుకున్న లక్ష్యంలో వాణిజ్యపన్నులశాఖ సుమారు రూ. 28 వేల కోట్లు చేరుకోవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరం కూడా రూ. 27 వేల కోట్ల మార్కు వద్దే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సంస్థ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. వెంకటేశ్వర్లు...శాఖలోని పరిస్థితిని మంత్రుల బృందం ముందుకు తీసుకెళ్లారు. ఈ శాఖలోని పరిస్థితి సీఎం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు సర్కార్ కీలక నిర్ణయాలకు సిద్ధమైంది.