స్వచ్ఛ సాగర్..!
హుస్సేన్‌సాగర్‌లోని నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు
తూముల్లో ముమ్మరంగా పూడికతీత
అధికారికంగా ప్రారంభంకాకున్నా వేగంగా పనులు
లోతట్టు ప్రాంతాలకు ముప్పు లేదంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి మణిహారమైన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. ‘మిషన్ హుస్సేన్‌సాగర్’ పేరిట తలపెట్టిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాకున్నా పది రోజులుగా తూముల్లో పూడికతీత పనులు వేగంగా సాగుతున్నాయి. దీర్ఘకాలంగా పూడుకుపోయిన తూముల్లోని చెత్త, ఇతరత్రా వ్యర్థాల తొలగింపును అధికారులు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని నీటిపారుదల విభాగం ఈ పనుల్ని పర్యవేక్షిస్తోంది.
హుస్సేన్‌సాగర్‌లోని మొత్తం నీటిని వేసవిలోనే తోడేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. అధికారికంగా ఆ పనులు ప్రారంభం కాలేదు. నీటిని ఖాళీ చేయాలంటే ఎదురయ్యే సమస్యలు, ఇతరత్రా అంశాల్ని అంచనా వేస్తున్న అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రసాయన వ్యర్థాలను సాగర్‌లోకి వదిలే ఎలక్ట్రోప్లేటింగ్ పరిశ్రమలను నగరం నుంచి శివారులోని మెదక్ జిల్లాలోకి తరలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. మరోవైపు సాగర్‌ను ఖాళీ చేయడానికి ముందు అందులోని నీరు దిగువకు సాఫీగా వెళ్లాలంటే చేయాల్సిన పనులపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. వాస్తవానికి ప్రతి ఏటా నిర్ణీత వ్యవధుల్లో ఈ పనులు చేయాల్సి ఉన్నా కొంతకాలంగా అధికారులు ఈ అంశాన్ని విస్మరించారు.
తూముల్లోని నీటి విడుదల..
హుస్సేన్‌సాగర్ నుంచి నీరు దిగువకు వెళ్లేందుకు మొత్తం ఆరు ప్రాంతాల్లో తూములున్నాయి. మారియట్(ఒకప్పటి వె స్రాయ్)హోటల్ వద్ద, దోబీఘాట్ వద్ద, పాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఇవి ఉన్నాయి. ప్రస్తుతం మారియట్ హోటల్‌కు సమీపంలోని నాలుగు తూముల్లో పూడికతీత, వ్యర్థాలు, మట్టికుప్పలు, బండరాళ్లను తొలగించే పని చేపట్టారు. దీంతో నీరు దిగువకు ప్రవహించేందుకు కొద్దిమేర మార్గం సుగమమైంది. ప్రస్తుతం రోజుకు సగటున 250 క్యూసెక్కుల నీరు వరకు వెళుతోంది.
పూడికతీత పూర్తయితే మరింత నీరు వెళ్లనుంది. వర్షాకాలంలోగా తూములన్నీ సవ్యంగా పనిచేసేలా అధికారులు ప్రస్తుతం చర్యలు చేపట్టారు. హుస్సేన్‌సాగర్‌లో గరిష్ట నీటి మట్టం (ఎఫ్టీఎల్) సామర్ధ్యం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం 512.5 మీటర్లుగా ఉంది. ఈ వేసవిలో జలాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడం సాధ్యం కానందున నిర్ణీత మట్టం వరకే నీటిని సహజసిద్ధంగా బయటికి వదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా చేపట్టిన పనులతో దిగువకు విడుదలవుతున్న నీటివల్ల లోతట్టు ప్రాంతాలు, బస్తీలకు ముప్పు లేదని ఇంజనీరింగ్ నిపుణుడొకరు చెప్పారు.
త్వరలో కూకట్పల్లి నాలా మళ్లింపు పనులు..
కూకట్పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజువారీగా వచ్చి చే రుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థాలు సాగర్‌లోకి చేరకుండా చూసేందుకు రూ.43 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులను జలమండలి త్వరలో ప్రారంభించనుంది. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించిన పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన ఏజెన్సీలకు రెండు, మూడు రోజుల్లో పనులు చేపట్టేందుకు వీలుగా వర్క్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నాలాల మళ్లింపు కారణంగా బల్క్ డ్రగ్, ఫార్మా కంపెనీల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు సాగర్‌లోకి చేరవు. ఈ నీటిని నేరుగా అంబర్‌పేట్‌లోని జలమండలి మురుగుశుద్ధి కేంద్రానికి తరలించి హానికారక మూలకాలను తొలగించిన అనంతరం మూసీలోకి వదలనున్నారు.
సాగర్.. గతమెంతో ఘనం..
కుతుబ్‌షాహీల కాలంలో నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇబ్రహీం కులీకుతుబ్‌షా 1562వ సంవత్సరంలో హుస్సేన్‌సాగర్ జలాశయాన్ని నిర్మించారు. హజ్రత్ హుస్సేన్‌షా వలీ అనే ఇంజనీర్ పర్యవేక్షణలో అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభతో జలాశయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నిజాంల కాలంలోనూ ఈ జలాశయం నగరవాసుల దాహార్తిని తీర్చింది. అప్పట్లోనే తాగునీరు, వ్యర్థజలాల వినియోగానికి సంబంధించి రెండు పైప్‌లైన్ వ్యవస్థలు.. ట్రంక్మెయిన్ పైప్‌లైన్ 1, 2 (డ్యుయల్ పైపింగ్సిస్టమ్) ఉన్నాయి. 18వ శతాబ్దం నాటికే ప్రపంచ దేశాలకు మన నగరం ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుతం అమెరికా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో ద్వంద్వ పైపుల వ్యవస్థ అభివృద్ధి చెందిందని ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు.
నేటికీ వినియోగం..
ఈ పురాతన పైప్‌లైన్ 400 డయామీటర్ల వ్యాసార్థంలో ఉన్నట్లు జలమండలి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అప్పట్లో ఆర్సీసీ(రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్)తో ఈ పైప్‌లైన్‌ను పకడ్బంధీగా రూపొందించారు. భూమట్టానికి 30 అడుగుల లోతు నుంచి ఈ పైప్‌లైన్ ఉన్నట్లు అంచనా. దీని పొడవు సుమారు 15 కిలోమీటర్లు. 19వ శతాబ్దం తొలినాళ్ల నుంచి నేటి వరకు.. అంటే సుమారు శతాబ్దకాలానికి పైగా సాగర్ జలాశయం నుంచి రావాటర్‌ను వినియోగిస్తున్న ఉద్యానవనాలు, భవంతులు, పరిశోధనశాలలు ఇతర ప్రజోపయోగ భవనాలు సుమారు 50 వరకు ఉన్నాయి. వీటికి ఇప్పటికీ రావాటర్ సాగర్ నుంచే అందుతుండటం విశేషం. ఉస్మానియా వర్సిటీ ల్యాండ్‌స్కేప్ గార్డెన్, పబ్లిక్‌గార్డెన్‌లోని హరిత తోరణం, కోఠి ఉమెన్స్ కళాశాల, హిందీ మహావిద్యాలయం, కోఠి మెడికల్ కళాశాల, అజామాబాద్ పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమలు, వైఎంసీఏ, కింగ్ కోఠి ప్రాంతంలోని పలు భవంతులకు సాగర్ రావాటర్ పైప్‌లైన్ సౌకర్యం ఉండటం గమనార్హం.