పాత పద్ధతిలోనే ఐఐటీ, ఎన్ఐటీల కౌన్సెలింగ్
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాలకు ప్రస్తుత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2016-17 సంవత్సరానికి కూడా ఉమ్మడిగానే ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్ మార్కుల వెయిటేజిని పరిగణనలోకి తీసుకుంటారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల తీరును సమూలంగా మార్చాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అయితే వీటిని 2017 తర్వాత నుంచి అమలు చేయాలని సూచించింది. దాంతో ఈసారికి పాత విధానమే అమలులో ఉంటుంది.
ఆ తర్వాత కొత్తగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఒకదాన్ని అమలుచేస్తారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనను తెలుసుకునేందుకు ఈ నేషనల్ టెస్టింగ్ సర్వీసు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో ఏటా కనీసం రెండుసార్లు ఆప్టిట్యూడ్ పరీక్ష ఉంటుంది. దీని ఆధారంగా జేఈఈకి 4 లక్షల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వారికి జేఈఈ (అడ్వాన్స్డ్) తరహాలో కొత్త పరీక్ష ఉంటుంది. ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించి 40 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.