ఓటేయలేదని వృద్ధురాలి సజీవదహనం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీకి ఓటయేనందుకు ఆ పార్టీ అభిమానులు 65 ఏళ్ల వృద్ధురాలిని సజీవదహనం చేశారు. నాసిక్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని బభుల్గావ్ ఖుర్ద్ గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమెకు 80% కాలినగాయాలు కావడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
జెలుబాయ్ జగన్నాథ్ వాబ్లే ఫిర్యాదు మేరకు అశోక్ బొర్నారే, పాండురంగ బొర్నారే, నందకిశోర్ భురక్ అనే ముగ్గురిని హత్యాయత్నం, నేరపూరితంగా బెదిరించడం నేరాల కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆ వృద్ధురాలు ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు ఈ ముగ్గురూ దారిలో ఆమెను ఆపి, మూడో నెంబరు బటన్ ఒత్తాలని చెప్పారు. అది శివసేన అభ్యర్థి శంభాజీ పవార్‌ది. కానీ బయటకు వచ్చాక ఆమె రెండో నెంబరు బటన్ (ఎన్సీపీ అభ్యర్థి ఛగన్ భుజ్‌బల్) నొక్కానని చెప్పడంతో ఆమెను చంపేస్తామని బెదిరించారు. తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చి, ఆమెను దుర్భాషలాడి, కిరోసిన్ పోసి నిప్పంటించారు.
అయితే వాబ్లే కొడుకు రఘునాథ్ మాత్రం అందుకు భిన్నంగా చెబుతున్నాడు. తనను కాపాడేందుకు వచ్చినవాళ్లే తనను చంపడానికి ప్రయత్నించారంటూ తన తల్లి చెబుతోందని అతడు అన్నాడు. ఇంట్లో వంట చేస్తుండగా దీపానికి ఆమె చీర అంటుకుందని అతడు చెబుతున్నాడు. వాస్తవాలేంటో తాము పరిశీలిస్తామని ఎస్పీ సంజయ్ మోహితే తెలిపారు.