దొంగతనం చేసిందనే నెపంతో... వృద్ధురాలిని కొట్టి చంపారు
రఘునాథపాలెం, న్యూస్‌లైన్:
దొంగతనం చేసిందనే నెపంతో వృద్ధురాలిని యజమానురాలు, తోటి కూలీలు కలిసి చితకబాదడంతో ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని మాయంచేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రఘునాధపాలెం మండలం పంగిడిలో కలకలం రేపిన ఈసంఘటనకు సంబంధించి పోలీసుల కథనంమేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లుకు చెందిన ఉప్పలపాటి అరుణకు పంగిడి సమీపంలోని ఎన్.వి.బంజర రోడ్డులో పామాయిల్ తోట ఉంది. ఆ తోటలో పనిచేసేందుకు విజయవాడ నుంచి వీరమ్మ (60) అనే వృద్ధురాలితో పాటు కూలీలు మూడు నెలల క్రితం వచ్చారు. వీరిలో కొందరు రఘునాథపాలెం, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వారున్నారు. వీరంతా తోటలోనే పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా, యజమానురాలు అరుణకు సంబంధించిన బంగారు గొలుసు, రూ.వెయ్యి నగదును దొంగతనానికి గురయ్యాయి. వీటిని వీరమ్మే దొంగిలించిందనే అనుమానంతో యజమానురాలు అరుణతోపాటు
తోటి కూలీలు మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో తీవ్రంగా కొట్టారు. ఈ దెబ్బలను తట్టుకోలేక వీరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో భయపడిన వారు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు.
యజమానురాలు అరుణ, కూలీలు మృతదేహాన్ని తోట మధ్యలోకి తీసుకువెళ్లి పడేశారు. అయితే ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు పామాయిల్ తోటకు చేరుకుని యజమానురాలిని, కూలీలను ప్రశ్నించగా తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తోటలో గాలింపు చర్యలు చేపట్టగా తోటమధ్యలో పడేసిన మృతదేహం కనిపించింది. కాగా, హత్యకు గురైన వీరమ్మ తనది రాజమండ్రి అని చెప్పినట్లు తోటి కూలీలు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేస్తే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. వృద్ధురాలి హత్య జరిగినట్లు సమాచారం తెలియడంతో పంగిడితో పాటు పరిసరగ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దోషులను కఠినంగా శింక్షించాలని కోరారు. సంఘటన ప్రాంతాన్ని డీఎస్పీ బాలకిషన్‌రావు పరిశీలించారు.