గోపీచంద్ వల్లే ఇదంతా సాధ్యమైంది: సింధు
హైదరాబాద్: ఒలింపిక్స్‌లో పతకం సాధించడమనేది తన స్వప్నమని, తన కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపింది. సోమవారం నగరానికి చేరుకున్న సింధుకు ఘన స్వాగతం లభించింది. గోపీచంద్ అకాడమీలో ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందని తాను అనుకోలేదని తెలిపింది. తల్లిదండ్రులు తనకోసం చాలా కష్టపడ్డారని ఆమె పేర్కొంది. వారికి ఏమిచ్చినా తక్కువేనని చెప్పింది. తల్లిదండ్రులతో పాటు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ సింధు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసింది. గోపీచంద్ అకాడమీలో అన్ని వసతులూ ఉన్నాయని...కోచ్ వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. సైనా నెహ్వాల్‌ను ప్రత్యేకంగా సింధు కొనియాడింది. దేశం కోసం సైనా ఎంతో కష్టపడిందని చెప్పింది. గతంలో ఆమె ఎన్నో మెడల్స్ సాధించిందని..భారత బ్యాడ్మింటన్‌కు సైనా అందించిన కృషి ఎంతో గొప్పదని ప్రశంసించింది.
ఈ సందర్భంగా కోచ్ గోపీచంద్ మాట్లాడుతూ... ఒలింపిక్స్ కోసం సింధు చాలా కష్టపడిందన్నారు. భవిష్యత్తులో సింధు బంగారు పతకం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని గోపీచంద్ అన్నారు.