గేమ్‌తో కుస్తీ.. నిద్రకు స్వస్తి
క్యాండీక్రష్ సాగా మత్తులో యువత
పిల్లలతో పాటు పెద్దలూ బానిసలే
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆట క్యాండీ క్రష్ సాగా. ఈ పేరుతోనూ ఓ ఆట ఉందా అనుకుంటున్నారా? ఉంది. అయితే శారీరక శ్రమ ఉండే ఆట కాదిది. ఏ ఒలింపిక్స్‌లోనూ ఆడరు దీనిని. గల్లీల్లోనూ పోటీలు ఉండవు. కేవలం సమయాన్ని వృథా చేసే గేమ్ ఇది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో గంటల తరబడి ఈ ఆట ఆడుతున్నారు. దీని మత్తులో యువతీ యువకులు మునిగి తేలుతున్నారు. కొందరైతే రాత్రింబవళ్లు ఈ ఆట ధ్యాసలోనే గడుపుతున్నారు. నిద్రకూ దూరమవుతున్నారు. కళాశాల విద్యార్థులు కొందరు తరగతులకు డుమ్మాకొట్టి మరీ గంటల కొద్దీ ఈ ఆట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దవాళ్లు కూడా ఈ ఆటకు బానిసలవుతున్నారు.
మద్నూర్ :
కొన్నాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. యువత ఫోన్ తీసుకు న్న మొదటి రోజే ఫేస్‌బుక్‌ను ఇన్స్టాల్ చేసు కుంటున్నారు. ఈ మధ్య కాలంలో క్యాండీక్రష్ సాగా అనే ఆట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫేస్బుక్ సిద్ధమైన వెంటనే క్యాండిక్రష్ సాగా ప్రత్యక్షమవుతోంది. దానిపై అవగహన లేకపోయినా స్నేహితుల ద్వారా మెస్సేజ్ ల ప్రవాహం మొదలవుతుంది. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలంలో ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేస్తే.. ఇక అంతే సంగతులు. తొలుత సరదాగా అనిపించే ఈ గేమ్.. ఆ తర్వాత వ్యసనంలా మారుతుంది.
పనులను పక్కనబెట్టి..
పట్టణంలో ఓ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన పని మరచిపోయి క్యాండీక్రష్ సాగా గేమ్ ఆడుతున్నాడు. కిరాణ దుకాణంలో జీతం ఉంటున్న వ్యక్తి నుంచి యజమాని వరకు అందరూ ఈ గేమ్‌లో మునిగి తేలుతున్నారు. ఈ గేమ్ కోసం పనులను సైతం పక్కన పెట్టేస్తున్నారు. కొందరు విద్యార్థులు కళాశాలలకూ వెళ్లకుండా ఆటాడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఈ గేమ్‌కు బానిసలైనవారిలో విద్యార్థులే కాదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులూ ఉండడం గమనార్హం. ఈ గేమ్ ఆడేవారి గేమ్ లెవల్ తదితర వివరాలు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అందరికీ తెలుస్తూనే ఉంటాయి. దీంతో ఇదో అంటువ్యాధిలా మారి అందరినీ ఇబ్బంది పెడుతుంది.
కాలాన్ని కరిగిస్తూ..
ఈ గేమ్ కారణంగా విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. విద్యార్థులపై ఈ గేమ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారిలో అత్యధిక మంది ఈ గేమ్‌లో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. మామూలుగా ఉన్న గేమ్‌లకు ఓ రీచ్ పాయింట్ ఉంటుంది. కానీ ఈ గేమ్ అన్లిమిటెడ్. 15 లెవల్ పూర్తి అయితే ఓ స్టేజ్ పూర్తి అవుతుంది. ఇలాంటి స్టేజీలు వెయ్యికి పైగా ఉన్నాయి. ఆ లెక్కన దీన్ని పూర్తి చేయాలంటే నెలల సమయం పడుతుంది. మధ్యలో లైఫ్‌లు లేనప్పుడు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టి మరీ లైఫ్‌లు పొందుతున్నారు. గేమ్ సంగతి ఎలా ఉన్నా నెట్ బ్యాలెన్స్ మాత్రం భారీగా కరిగిపోతోంది.