స్క్వాష్ లేకపోవడం నిరాశ కలిగించింది!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను క్రీడాంశంగా చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని భారత స్టార్ క్రీడాకారిణి జ్యోత్స్న చిన్నప్ప వ్యాఖ్యానించింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాఖ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని ఆమె వివరించింది. ‘ఇది మా ఆటకు వెనకడుగులాంటిదే. ఏ ఆటగాడికైనా ఒలింపిక్స్ పతకమే లక్ష్యం.
ఇతర క్రీడాకారులతో సమానంగా మేం కూడా శ్రమిస్తాం కాబట్టి మాకూ అదే ఉంటుంది. ఒలింపిక్స్‌లో లేకపోతే కార్పొరేట్ సంస్థలు ప్రోత్సహించవు. స్పాన్సర్లు కూడా ముందుకు రారు. కాబట్టి స్క్వాష్‌ను తాజా నిర్ణయం ఇబ్బంది పెడుతుంది’ అని ఆమె అభిప్రాయ పడింది. అయితే రెజ్లింగ్‌ను తొలగించడమే తన దృష్టిలో తప్పని చెప్పింది. ‘కొత్త ఆటను చేర్చాలని అందరూ భావిస్తారు గానీ ఒక ప్రాచీన క్రీడను తొలగించాలని ఎవరూ కోరుకోరు. రెజ్లింగ్‌నే అసలు తప్పించకుండా ఉండాల్సింది.
ఇప్పుడు ఆ జాబితాలో ఉండేందుకు రెజ్లింగ్‌కు అర్హత ఉంది’ అని ఆమె విశ్లేషించింది. ఇటీవల అర్జున అవార్డు అందుకోవడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణాలుగా పేర్కొన్న జ్యోత్స్న... రాబోయే ఏడాది కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. మరో వైపు భారత ఫుట్‌బాల్ ఆటగాడు గుర్మాంగీ సింగ్ మాట్లాడుతూ...ఐపీఎల్ తరహాలో ప్రతిపాదిస్తున్న ఫుట్‌బాల్ లీగ్ ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నాడు. తన కెరీర్ ప్రస్తుతం నిలకడగా సాగుతోందని, త్వరలో నాలుగు వారాల పాటు డెన్మార్క్ క్లబ్ తరఫు ఆడనున్నట్లు అతను వెల్లడించాడు.
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘నైకీ’ నగరంలో ఏర్పాటు చేసిన కొత్త స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం జ్యోత్స్న, గుర్మాంగీ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లో దాదాపు 400 చదరపు గజాల వైశాల్యంలో నైకీ కొత్త తరహా ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఈ షోరూం హైదరాబాద్‌లోనే అతి పెద్దదని ఆ సంస్థ మార్కెటింగ్ డెరైక్టర్ అవినాష్ పంత్ వెల్లడించారు. క్రికెటేతర క్రీడలతో కూడా తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.