జయలలిత ఎస్టేట్లో దోపిడీ, వాచ్మన్ హత్య
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం గుట్టుచప్పుడు కాకుండా ముందుగా ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ మాయం చేస్తున్నారు. అందులోభాగంగా సోమవారం తెల్లవారుజామున కొడనాడులో జయలలితకు అత్యంత ఇష్టమైన ఎస్టేట్లో దోపిడీ జరిగింది. అక్కడున్న ఇద్దరు వాచ్మన్లపై తీవ్రంగా దాడిచేసి వారిలో ఒకరిని చంపి ఎస్టేట్లో ఉన్న కీలకమైన పత్రాలను తీసుకెళ్లిపోయారు. సుమారు వారం రోజుల క్రితమే చెన్నై శివార్లలోని సిరుతాపూర్ బంగ్లాకు నిప్పు పెట్టినప్పుడు కూడా అందులో కొన్ని పత్రాలు కాలిపోయాయి, మరికొన్ని మాయమయ్యాయి. ఇప్పుడు కొడనాడు ఎస్టేట్లో దోపిడీ జరిగినా.. అందులో పత్రాలు తప్ప మరేమీ పోలేదు.
ఈ ఎస్టేట్లో జయలలితకు అత్యంత నమ్మకస్తుడైన ఓం బహదూర్ అనే నేపాలీ వ్యక్తి గత 30 ఏళ్లుగా కాపలా ఉంటున్నాడు. అతడిని హతమార్చి, అతడితో పాటు ఉన్న మరో వాచ్మన్ను తీవ్రంగా గాయపరిచిన దుండగులు.. ఎస్టేట్లో జయలలిత ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నింటినీ తీసుకెళ్లిపోయారు. జయలలిత మరణం తర్వాత ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి చాలా వర్గాలు ప్రయత్నించాయి. కొన్ని ఆస్తులు ప్రస్తుతం శశికళ వర్గీయుల చేతుల్లో ఉన్నాయి. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్లోని ద్రాక్ష తోటలు, సిరుతాపూర్ బంగ్లా, చెన్నై పోయెస్ గార్డెన్స్.. వీటన్నింటి విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు వీటిమీద హక్కుల కోసం తెరవెనక చాలా కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వరుసపెట్టి దాడులు, పత్రాల చోరీ జరుగుతున్నట్లు జయలలిత సన్నిహితులు చెబుతున్నారు.