ఓం శాంతి సేవలో పాతికేళ్లు
బ్రహ్మకుమారీలకు సత్కారాలు
ఘనంగా రజతోత్సవాలు
అమలాపురం టౌన్ :
సమాజంలో ఆధ్యాత్మికత వ్యాప్తి.. సేవా తత్పరత ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా పిత ఈశ్వరీయ విద్యాలయ వ్యవస్థలో బ్రహ్మకుమారీలుగా జిల్లాలో అందిస్తున్న సేవలు, ఆచరణీయ మార్గాలు అభినందనీయమని ఓం శాంతి ఇన్చార్జి బీకే రజని అన్నారు. బ్రహ్మకుమారీలుగా జిల్లాలో కొందరు ఓం శాంతి ఇన్చార్జిలు పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో జిల్లా స్థాయి బ్రహ్మకుమారీల రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్త బ్రహ్మకుమారీలు హాజరైన సదస్సుకు జిల్లా ఇన్చార్జి రజని అధ్యక్షత వహించి మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట బ్రహ్మకుమారీలుగా మారి సేవే పరమార్ధంగా పనిచేస్తున్న జిల్లాలోని తొమ్మిది ఓం శాంతి కేంద్రాల ఇన్చార్జిలను సత్కరించారు. అనంతరం తమ పాతికేళ్ల అధ్యాత్మిక, సేవా ప్రస్థానాన్ని వివరించారు. సత్కారాలు అందుకున్న వారిలో జిల్లా ఇన్చార్జి రజని, అమలాపురం ఇన్చార్జి శ్రీదేవి, స్వరూప, మీరా తదితరులు ఉన్నారు. శివ తత్వంతో ఎలా సేవ చేయవచ్చో...సేవ తత్వంతో శివ మార్గంలో ఎలా వెళ్లవచ్చో రజని వివరించారు. ఓం శాంతి మార్గంలోకి వచ్చిన జిల్లాలోని బ్రహ్మకుమారీలంతా ఎవరికి వారు పాతికేళ్ల సేవలను పూర్తి చేసుకుని రజతోత్సవం చేసుకోవాలని అప్పుడే ప్రజల్లో కూడా ఓం శాంతి సేవలు జిల్లాలో మరింత విస్తరించగలవని ఆమె ఆకాంక్షించారు.