బాలుడి చిట్కాతో హ్యాట్రిక్ ఫీట్: ఉనద్కత్
న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్‌పై మ్యాచ్‌లో చివరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించి హీరో అయిపోయిన జయదేవ్ ఉనద్కత్ అందుకు గల కారణాలు వింటే షాకవ్వాల్సిందే. హ్యాట్రిక్ ట్రిక్స్ తాను 12 ఏళ్ల బాలుడి నుంచి నేర్చుకున్నానని పుణే బౌలర్ ఉనద్కత్ తెలిపాడు. గత ఆదివారం మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పై 12 పరుగుల తేడాతో పుణేను గెలిపించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఈ వివరాలను పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 28న సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డుప్లెసిస్ లతో కలిసి ఉనద్కత్ పుణేలోని ఏపీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో పాల్గొన్నారు.
ఆ సమయంలో 12 ఏళ్ల ఓంకార్ పవార్ అనే విద్యార్థి ఏ మోహమాటం లేకుండా తనకు బౌలింగ్ మెలకువలు నేర్పించాడని చెప్పాడు. బంతులలో వైవిధ్యం చూపించడానికి బౌలింగ్ చేసి చూపించాడని వివరించాడు. చివరి ఓవర్లో వరుస బంతుల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు బిపుల్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ లను పెవిలియన్ బాట పట్టించి హ్యాట్రిక్ ఫీట్ నమోదుచేశాడు. ఆ స్కూళ్లోనే తన హ్యాట్రిక్ ఫీట్‌కు బీజం పడిందని పుణే ప్లేయర్ హర్షం వ్యక్తం చేశాడు. హాట్రికె వికెట్లతో పాటు మెయిడిన్ ఓవర్ వేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.