మరోసారి శ్రీవారి సేవలో..
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు బుధవారం మరోసారి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన జస్టిస్ దత్తు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయన ఓ సామాన్య భక్తుడిలా తిరుమలలో కలియ తిరిగారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలసి మరోసారి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు.
అనంతరం గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ చీఫ్ జస్టిస్ను శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.