ఇద్దరు డిప్యూటీ స్పీకర్లు.. ఒకే చాంబర్!
సాక్షి, హైదరాబాద్:
రెండు రాష్ట్రాల డిప్యూటీ స్పీకర్లు... ఒకే చాంబర్!
టీఆర్ఎస్కు ఇచ్చిన గదులు.. ఏపీ చీఫ్‌విప్‌కు కేటాయింపు
టీ టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు లాబీల్లోని గదులే దిక్కు...
స్థూలంగా శాసనసభ ఆవరణలో చాంబర్ల కేటాయింపు ఇది. తెలంగాణ, ఏపీ శాసనసభల కార్యదర్శుల సమన్వయ లోపం కారణంగా ఇరు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కేటాయించిన చాంబర్ల వ్యవహారం వివాదాస్పదమైంది. అసెంబ్లీ ఆవరణలో గత 14 ఏళ్లుగా కొనసాగుతున్న కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తూ టీ శాసనసభ కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజసదారాం గురువారం సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించిన గదులను సీఎల్పీకి కేటాయిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. మజ్లిస్ శాసనసభాపక్ష కార్యాలయాన్ని మాత్రం యథావిధిగా ఆ పార్టీకే కేటాయించారు. తెలంగాణ టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు అసెంబ్లీ ఆవరణలో కార్యాలయాలను కేటాయించలేదు. ఆయా పార్టీలను కొత్త అసెంబ్లీ భవన సముదాయ లాబీల్లోని గదులకే పరిమితం చేశారు. అదే భవనంలోని 7, 8, 11, 12, 13, 17 నుంచి 32 వరకు ఉన్న గదులను తెలంగాణ మంత్రుల చాంబర్లుగా కేటాయించారు. శాసనసభ్యుల లాంజ్ పక్క గదిని మీడియాకు కేటాయించారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేటాయించిన గదులను యథావిధిగా కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మల్లు భట్టివిక్రమార్క విధులు నిర్వహించిన కార్యాలయాన్ని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి కేటాయించారు. దీంతోపాటు సదారాం పేరిట జారీ అయిన మరో సర్క్యులర్‌లో శాసనమండలి చైర్మన్, ఇతర పార్టీలకు కేటాయించిన చాంబర్ల వివరాల్ని వెల్లడించారు. శాసనమండలి ఆవరణలోని గ్రంథాలయం ఎదురుగా ఉన్న కొత్త భవనంలో మండలి చైర్మన్‌కు కార్యాలయాన్ని కేటాయించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, పీడీఎఫ్, పీఆర్టీయూ చాంబర్లనూ ఇదే భవనంలో కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.
పొంతనలేని కేటాయింపులు
టీ శాసనసభ కార్యదర్శి సదారాం గురువారం జారీ చేసిన సర్క్యులర్ ప్రతులు శుక్రవారం అన్ని పార్టీల శాసనసభాపక్ష కార్యాలయాలకు చేరాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఏపీ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణరావుపేరిట ఆయా కార్యాలయాలకు మరో సర్క్యులర్ అందింది. అందులోని వివరాల ప్రకారం.. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు కేటాయించిన (ఓబీ జీ4, జీ5) చాంబర్‌ను ఏపీ డిప్యూటీ స్పీకర్ బుద్దప్రసాద్‌కు కేటాయించారు. టీఆర్ఎస్కు కేటాయించిన వాటిలోని రెండు గదులను (జీ1, జీ2) ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులుకు కేటాయించారు. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో టీ శాననసభవ్యవహారాలమంత్రి హరీష్‌రావు, కార్యదర్శి సదారాం శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు.