ప్రధాని సహాయనిధికి 'ఓటుకు కోటి' సొమ్ము
సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీల నుంచి 2008లో 'ఓటుకు కోటి' స్కాంలో స్వాధీనం చేసుకున్న కోటి రూపాయల సొమ్మును ప్రధాన మంత్రి సహాయనిధికి జమ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఆ సొమ్ము తమదని ఎవరూ చెప్పకపోవడంతో సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ప్రధాని సహాయనిధికి పంపాలని తెలిపింది.
నాటి బీజేపీ ఎంపీ అశోక్ అర్గల్ ఇంటి సమీపంలో అమర్ సింగ్ మాజీ సహచరుడు సంజీవ్ సక్సేనా ఈ సొమ్ము పంచుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు వాదించాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులపైన ఛార్జిషీటు దాఖలుచేశారని, ఇక ఈ కేసులో పెండింగు అంశమంటూ ఏమీ లేదని కోర్టు తెలిపింది. ఈ సొమ్ము ఏం చేయాలన్న విషయమై కూడా ఏమీ తేలకపోవడంతో.. మొత్తం కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి పంపాలని ఆదేశించింది.