ఆన్‌లైన్‌లోనూ మాఫియా మోసాలు
=నకిలీ సీబుక్కులతో టోకరా
=యథేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు
= వెలుగు చూసిన మరో మోసం
= వాహనాలకు భద్రతేదీ?
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మోసాలకు పాల్పడేవారికి మాన్యువల్ విధానమైనా, ఆన్లైన్ అయినా అడ్డంకి కాదని ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇలాంటి వారికి ఆన్లైన్ ఎక్కువ వెసులుబాటుగా ఉన్నట్లు ఆయా ఘటనలను బట్టి తెలుస్తోంది.
నకిలీ సీబుక్కులు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లతో లారీలను ఫైనాన్స్ చేసి దాదాపు కోటి రూపాయలు టోకరా వేసిన ముఠాను ఆరు నెలల కిందట కృష్ణలంక పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆటోనగర్‌కు చెందిన అసలు దొంగలు తెరవెనుక ఉండి అమాయకులను అరెస్టు చేయించారు. ముఠా సభ్యులు నగరంలో దాదాపు 10 ఫైనాన్స్ సంస్థలను, ఓ జాతీయ బ్యాంకును మోసగించారు. హైదరాబాద్, గుంటూరు నగరాల్లోని ఆటోనగర్లలో వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా సభ్యులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి తరువాత మిన్నకుండిపోయారు.
ఇదే ముఠాపై గతంలో పటమట, మాచవరం పోలీస్ స్టేషన్లలో ఇదే తరహాలో లారీలు, కార్లు దొంగ రిజిస్ట్రేషన్ల కేసులు నమోదయ్యాయి.
మూడు మాసాల క్రితం తమిళనాడుకు చెందిన మూడు ట్యాంకర్లను నకిలీ అడ్రస్‌లతో విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీతో కొందరు ఓనర్లు ఈ నకిలీ ఉద ంతాన్ని బయటపెట్టి గొడవ చేశారు.
తాజాగా నగరంలో ఓ యువకుని మోటారు బైక్‌ను రవాణాశాఖలో దళారులు బినామీ వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేశారు. అంతటితో ఆగకుండా అదే వ్యక్తి పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థను కూడా మోసగించి సొమ్ము తీసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
నగరంలో ఇటీవలి కాలంలో వైట్‌కాలర్ నేరస్తులు ఆన్లైన్ విధానం ద్వారా ఆధునిక పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజలకు పారదర్శకంగా ఉండటం కోసం రూపొందించిన ఆన్లైన్ విధానంలో మోసాలు నగరంలోనూ పెరుగుతున్నాయి. మాన్యువల్ విధానం కంటే ఆన్లైన్లోనే సులభంగా మోసం చేయవచ్చని శుక్రవారం వెలుగు చూసిన సంఘటన రుజువు చేసింది. విజయవాడలో రవాణా శాఖలో దళారులు ఈ తరహా మోసాలకు తెగబడుతున్నారు.
ఆన్లైన్ విధానంలో లొసుగులను పసిగట్టిన దళారులు.. కొందరు బినామీ వ్యక్తులను సృష్టించి సనాయాసంగా దొంగ రిజిస్ట్రేషన్లను యథేచ్ఛగా చేయిస్తున్నారు. నగరంలో త్రిపురనేని శ్రీరామ్‌కు అనే వ్యక్తికి చెందిన ఏపీ 16సీసీ 9555 యమహా బైక్ రిజిస్ట్రేషన్‌లో పేరు అతనికి తెలియకుండా మారిపోయింది. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పేరుతో ఆ బైక్ మరోసారి రిజిస్టర్ అయింది. ఆన్లైన్ మాఫియా ముఠా అంతటితో ఆగకుండా పూజిత ఫైనాన్స్ సంస్థ నుంచి ఆ బైక్ పై రూ.50 వేలు రుణం కూడా తీసుకుంది.
గత సెప్టెంబర్ నెలలో ఆ బైక్ పేరుమారి రుణం మంజూరైనట్లు ఇంటర్నెట్లో కనిపించింది. దళారులు తెలివిగా ఆన్లైన్లో ఆ బైక్ రిజిస్ట్రేషన్‌లో యజమాని పేరును మార్చి, డబ్బు నొక్కేసారు. రుణం ఇచ్చిన ఫైనాన్స్ సంస్థ నుంచి శ్రీరామ్‌కు ఫోన్ వచ్చింది. దీంతో అతడు ఆ సంస్థకు వెళ్లి, తాను రుణం తీసుకోలేదని, సొంత డబ్బుతో కొనుగోలు చేశారని నిర్వాహకులకు చెప్పారు.
బైక్ మాత్రం అసలు యజమాని వద్దే ఉంది. దళారులు నకిలీ ఓనర్ పేరుతో పత్రాలు సృష్టించి, సొమ్ము కాజేశారు. మొత్తం మీద ఫైనాన్షియర్, బైక్ అసలు యజమాని ఈ వ్యవహారానికి సంబంధించి రవాణాశాఖ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. ఈ పరిస్థితిలో ఏంచేయాలో వారికి పాలుపోవటం లేదు. కొందరు రవాణా అధికారులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అసలు మోసం ఏవిధంగా జరిగిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.