వన్డేలో అయిపోయాయ్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: భారత్- వెస్టిండీస్ మధ్య విశాఖలో ఈ నెల 24న జరగనున్న రెండో వన్డే క్రికెట్ మ్యాచ్‌కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వర్షం కురుస్తున్నా క్రీడాభిమానులు మీ సేవా కేంద్రాలతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద గురువారం వేకువజాము నుంచే బారులు తీరారు.
దాదాపు 12 వేల టికెట్లను జిల్లా రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, భీమిలి, తగరపువలస, నగరంలోని 20 మీ సేవా కేంద్రాల ద్వారా టికెట్లు విక్రయించారు. ఉద యం ఎనిమిది గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. లోయ ర్ డినామినేషన్లలోనే కాక హయ్యర్ డినామినేషన్లోనూ టికెట్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి మీ సేవా కేంద్రంలో రూ.400లవి 75, రూ.750వి 200, రూ.1250వి 100 టికెట్లు విక్రయానికి ఉంచగా రూ.2 వేలు, రూ. 3వేల టికెట్లను కేవలం పదిహేనేసి మాత్రమే ఉంచారు.
ఇవి వెంటనే అమ్ముడయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా టికెట్లు అయిపోయి కౌంటర్లు బోసిపోయాయి. రూ.5 వేల టికెట్లను పదేసి చొప్పున ఇవ్వగా ఒకటో రెండో మిగిలి ఉన్నాయి. స్టేడియంలోని కౌంటర్లో హై డినామినేషన టికెట్లను మాత్రమే ఉంచారు. తొలి వన్డేలో భారత్ విజయం సాధించడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. విశాఖలో జరిగే రెండో వన్డేలో కూడా విజయం సాధిస్తే సిరీస్ సొంతమవుతుందన్న ఆనందం అందరిలో ఉంది.