రేపు రాష్ట్రానికి అమిత్ షా
వరంగల్ సభకు హాజరుకానున్న బీజేపీ అధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకరోజు పర్యటన కోసం శనివారం రాష్ట్రానికి రానున్నారు. ప్రత్యేక తిరంగా యాత్రలో భాగంగా సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన ఉత్సవాలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 70 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9 నుంచి 22 వరకు తిరంగా యాత్రను నిర్వహించింది. అయితే రాష్ట్రంతోపాటు నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహా రాష్ట్రలోని 5, కర్ణాటకలోని మూడు జిల్లాల్లో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు యాత్రను జరుపుతోంది.
రాష్ట్రంలో యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో జరగ నున్న బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హజరవుతారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరి 2 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుం టారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్‌కు వెళ్లి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాత్రి ఓ ప్రైవేట్ హోటల్లో బస చేస్తారు. పర్యటన సందర్భంగా పార్టీ నాయకులతో ఎలాంటి సమావేశాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదివారం ఉదయమే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరాటానికి ప్రాధాన్యమున్న ఒకటి, రెండు ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించి నిజాం వ్యతిరేక పోరాట అమరులకు నివాళి అర్పించేలా కార్యక్రమాలను రూపొందించాలని రాష్ట్ర నేతలు తొలుత భావించారు. అయితే సమయం సరిపోకపోవడంతో బహిరంగ సభకే పరిమితం చేశారు.