ఐదేళ్లలో 28 లక్షల కోట్లు
• భారత టాప్ 100 కంపెనీలు సృష్టించిన సంపద
• అగ్రస్థానంలో టీసీఎస్ మోతిలాల్ ఓస్వాల్ నివేదిక
ముంబై: దేశంలోని అగ్రస్థాయి వంద కంపెనీల మార్కెట్ విలువ ఐదేళ్లలో జోరుగా పెరిగింది. 2011-16 కాలానికి ఈ కంపెనీలు రూ.28.4 లక్షల కోట్ల సంపదను సృష్టించాయని మోతిలాల్ ఓస్వాల్ రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, సంపద సృష్టి జరుగుతూనే ఉందని వివరించింది. ‘21వ వార్షిక సంపద సృష్టి నివేదిక’ పేరుతో మోతిలాల్ ఓస్వాల్ అందించిన వివరాల్లో ముఖ్యాంశాలు..,
⇔ కంపెనీల విలీనాలు, డీ-మెర్జర్, బై బ్యాక్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 2011-16 మధ్య కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో వచ్చిన మార్పులను ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
⇔ 2011-16 కాలానికి అధిక సంపదను సృష్టించిన కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ రూ.2.6 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. మార్కెట్ విలువ పెంచడంలో ఈ కంపెనీ వరుసగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.
⇔ టీసీఎస్ తర్వాతి స్థానాన్ని హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ సాధించింది.
⇔ వేగంగా మార్కెట్క్యాప్ పెరిగిన కంపెనీగా అజంతా ఫార్మా నిలిచింది.ఇది ఈ ఘనత సాధించడం వరుసగా రెండోసారి.
⇔ అత్యంత నిలకడగా సంపద పెరిగిన కంపెనీగా ఏషియన్ పెయింట్స్ అవతరించింది.
⇔ రంగాల వారీగా చూస్తే కన్సూమర్/రిటైల్‌రంగం అత్యధిక సంపద సృష్టించిన రంగంగా వరుసగా రెండో ఏడాది నిలిచింది.
⇔ ఈ ఐదేళ్ల కాలంలో సంపద సృష్టిలో ప్రభుత్వ రంగ సంస్థలు దయనీయమైన స్థారుులో ఉన్నారుు.
⇔ మొత్తం వంద కంపెనీల్లో కేవలం ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే చోటు దక్కింది. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, కాన్కర్, ఎల్ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్‌గ్రిడ్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది.
⇔ మొత్తం సంపదలో ఈ ఏడు ప్రభుత్వ రంగ సంస్థల వాటా 4 శాతం మాత్రమే.