ఏడేళ్లు... వంద సినిమాలు
నటులు దర్శకులు కావడం కామన్. కానీ, దర్శకుడు పూర్తి స్థాయి నటుడు కావడం విశేషంగా చెప్పుకోవాలి. ‘నువ్వులేక నేను లేను’, ‘తొలి చూపులోనే’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వై.కాశీ విశ్వనాథ్ ‘నచ్చావులే’ చిత్రంతో నటుడిగా మారారు. అప్పటి నుంచి పలు పాత్రల్లో నటించిన ఆయన తాజాగా చేస్తున్న ‘వైశాఖం’తో వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు. హరీష్, అవంతిక జంటగా జయ బి. దర్శకత్వంలో ఆర్జే సినిమాస్ పతాకంపై బీఏ రాజు నిర్మించారు.
ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు విశ్వనాథ్. ఆయన మాట్లాడుతూ- ‘‘నటునిగా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆరేడేళ్లలో నేను వంద చిత్రాలు చేశానంటే ఆ క్రెడిట్ దర్శకులు, నిర్మాతలు, రచయితలకు దక్కుతుంది. వారు అవకాశం ఇవ్వబట్టే ఇన్ని చిత్రాల్లో నటించగలిగాను. సీరియల్స్‌లో చేయమని అడిగారు, కానీ అందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం చేస్తున్న ‘వైశాఖం’లో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నా గెటప్, మేనరిజమ్స్ కొత్తగా ఉంటాయి. హీరోతో ఎక్కువ సన్నివేశాలుంటాయి. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఇది నా నూరవ సినిమా కావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.