ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లకు.. వన్‌టైమ్ పాస్వర్డ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించి మోసాలను అరికట్టేందుకు వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ఇంజనీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. వెబ్సైట్లో ఆప్షన్లు ఇచ్చే పేజీలోకి వెళ్లి విద్యార్థి తన వివరాలను నమోదు చేయగానే ఆ విద్యార్థి మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా ఏర్పాట్లు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకున్నారు. ఈ వన్‌టైమ్ పాస్వర్డ్ 15 నిమిషాల పాటు పనిచేసేలా చర్యలు చేపట్టాలని.. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)తో రూపొందించాలని నిర్ణయించారు. దీంతోపాటు హెల్ప్‌లైన్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచనున్నారు.
ఇంజనీరింగ్ ప్రవేశాల్లో వెబ్ ఆప్షన్ల విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల వారు విద్యార్థి స్క్రాచ్ కార్డులోని పాస్‌వర్డ్‌ను దొంగిలించడం.. విద్యార్థులకు తెలియకుండానే, వారు ఇవ్వకపోయినా కొన్ని కాలేజీల్లో ఆప్షన్లు ఇవ్వడం వంటి మోసాల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై ఉన్నత స్థాయి కమిటీ పలు ప్రతిపాదనలను పరిశీలించింది. ఇంటర్నెట్ కేంద్రాలు, ఇళ్లలోంచి కాకుండా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే ఆలోచనచేసింది. కానీ, అందులోని ఇబ్బందుల నేపథ్యంలో వన్‌టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ఇదీ వన్ టైం పాస్వర్డ్ విధానం: విద్యార్థి దరఖాస్తు చేసుకున్నప్పుడే మొబైల్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఆ మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ సహాయంతో వెబ్సైట్లో ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ పాస్వర్డ్ 15 నిమిషాల పాటు మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలోగా విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు వాటంతట అవే సేవ్ అయి, విద్యార్థి లాగ్ అవుట్ అవుతాడు. మళ్లీ లాగిన్ అయితే మరో పాస్వర్డ్ వస్తుంది. దానితో మళ్లీ పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, ఇచ్చిన ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, దళారీలు మోసం చేసినా, ప్రలోభాలకు గురిచేసినా... ఆ తరువాత విద్యార్థి మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. 14 రోజుల పాటు ఈ ఆప్షన్ల ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. చివరి రోజున విద్యార్థి మరోసారి ఆప్షన్లను సరిచూసుకొని మార్పు చేసుకొని సబ్మిట్ చేయవచ్చు.