మెగా డిస్కౌంట్ వస్తువుల జప్తు
ఆందోళనలో బాధితులు
ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలో గల ధస్నాపూర్లో ఇటీవల వెలసిన మాధా ఆర్డర్ సప్లయర్ మెగా డిస్కౌంట్ గృహోపకరణాల విక్రయ సంస్థలోని వస్తువులను సోమవారం ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు జప్తు చేశారు. ఈ సంస్థ నిర్వాహకులు ముందస్తుగా వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుని వస్తువులు ఇవ్వకపోవడంతో నాలుగు రోజుల క్రితం బాధితులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ పేరుతో పోలీసులు ఈ దుకాణాన్ని మూసివేశారు. కాగా డబ్బులు కట్టిన పక్షం రోజుల్లో వినియోగదారుడు కోరుకున్న వస్తువును 40 శాతం డిస్కౌంట్‌తో అందజేస్తామని సంస్థ నిర్వాహకులు మొదట ప్రచారం చేయడంతో వినియోగదారులు బారులు తీరారు.
పక్షం రోజుల తర్వాత వస్తువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. గొడవ ముదురుతుందనే ఉద్దేశంతో సదరు యజమాని పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ వస్తువులను జప్తు చేసేందుకు సోమవారం దుకాణానికి రావడంతో బాధితులు అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ వస్తువులను తీసుకెళ్లనివ్వమని ఆందోళన చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్సైలు శ్రీనివాస్, అబ్దుల్ నజీర్‌లు బాధితులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. తాము కట్టిన డబ్బులు వస్తాయో లేదోననే ఆందోళనలో బాధితులున్నారు. సుమారు రెండు వేల మంది వరకు ముందస్తుగా ఈ సంస్థలో డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది.