బాలుడి అపహరణకు విఫలయత్నం
మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద ఏడాది వయసున్న ఓ బాలుడిని దుండగుడు అపహరించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు... హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి క్యాంటీన్లో కృష్ణ, లక్ష్మి దంపతులు పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు సాయిరామ్ ఉన్నాడు.
అయితే శనివారం సాయిరామ్ అక్కడే ఆడుకుంటుండగా మెదక్ జిల్లా మేడిపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బాలుడిని తీసుకుని పరారయ్యే ప్రయత్నం చేశాడు. దీన్ని సమీపంలోని ఆర్టికల్ షాపు యజమాని గమనించి శ్రీనివాస్‌ను అడ్డుకున్నాడు. స్థానికుల సాయంతో శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు.