గడువుపై కొనసాగుతున్న ఉత్కంఠ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై శాసనసభలో చర్చకు గడువు పొడిగింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముందు ప్రకటించిన ప్రకారం శాసనసభ శీతాకాల సమావేశాలు నేటితో ముగియాలి. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చకు కూడా రాష్ట్రపతి ముందు ఇచ్చిన గడువు ప్రకారం ఈ రోజే ఆఖరు. ఒక పక్క బిల్లుపై చర్చ ముగియలేదు - మరో పక్క చర్చకు గడువు పొడిగించమని కోరిన అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.
చర్చకు గడువు పొడిగింపుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక చాలా రోజుల పాటు సభ సజావుగా సాగకపోవడంతో సభ్యులందరూ చర్చలో పాల్గొనలేకపోయారని, అందువల్ల గడువు పొడిగించాలంటూ ప్రణబ్‌ముఖర్జీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖరాసింది. రాష్ట్రపతి వారం రోజులు గడువు పొడిగించే అవకాశం ఉండవచ్చని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే గడువు పొడిగింపునకు సంబంధించి శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిన తరువాత అసెంబ్లీ స్పీకర్ లేఖ రాయాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాయడంపై న్యాయపరమైన చర్చ జరుగుతోంది. అందువల్లే నిర్ణయం వెలువడడంలో ఆలస్యం అవుతుండవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై అటార్నీ జనరల్ నుంచి రాష్ట్రపతి న్యాయ సలహా కూడా కోరారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు గడువు పొడిగింపు వద్దంటూ రాష్ట్రపతికి లేఖలు రాశారు. గడువు పొడిగింపు వల్ల ప్రయోజనం లేదని, సభా సమయాన్ని వృథాచేశారని, గడువు పొడిగిస్తే పార్లమెంటులో బిల్లు అనుమతి పొందేందుకు సమయం సరిపోదని వాటిలో పేర్కొన్నారు. చర్చకు గడువు పొడిగించే విషయమై రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ జరపాలని, ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.