ఉల్లి, టమాట ధరలు తగ్గుముఖం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: రెండు రోజుల క్రితం వరకు అధిక ధరలతో సామాన్య, మధ్య తరగతి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉల్లి, టమాట ఇప్పుడిప్పుడే దిగివస్తూ ఉరటనిస్తున్నాయి. మహారాష్ట్రలోని పండిన ఉల్లి దిగుబడుల రాక ప్రారంభం కావడంతో జిల్లాలో ఉల్లికి డిమాండ్ తగ్గింది. మూడు నెలల క్రితం ఉల్లి క్వింటాలు ధర రూ.4,900 వరకు వెళ్లింది. రిటైల్‌గా కిలో రూ.60 వరకు అమ్మారు. తర్వాత రూ.3800కు తగ్గి మూడు నెలల పాటు ఇదే ధర కొనసాగుతుండడంతో రెండేళ్లుగా నష్టాలను భరిస్తూ వచ్చిన రైతులు ఈ ఏడాది లాభాలు పండించుకున్నారు. నాలుగు నెలలుగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో దాదాపు 80 శాతం మంది రైతులు గిట్టుబాటు ధర అంటే క్వింటాలు రూ.3 వేల పైనే అమ్ముకున్నారు.
ఇప్పుడిప్పుడే ఉల్లి ధర తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతుండగా వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు. అక్టోబర్ 31న క్వింటాలు గరిష్ట ధర రూ.2810కి పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే రూ.1000 వరకు తగ్గడం గమనార్హం. ఈనెల 1వ తేదీ మరింత తగ్గి గరిష్ట ధర రూ.2,650కి చేరింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకమాదిరి నాణ్యత కల్గిన ఉల్లి కిలో ధర రూ.15 ఉండగా, నాణ్యత కల్గిన ఉల్లి రూ.30 వరకు అమ్ముతున్నారు. టమాటను తీసుకుంటే మొన్నటికి కిలో ధర రూ.30 ఆపైన ఉండగా ఆదివారం కిలో రూ.16కు తగ్గిపోయింది. మార్కెట్లోకి టమాట దిగుబడులు అధికంగా వస్తుండడంతో డిమాండ్ తగ్గి ఆ మేరకు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వినియోగ దారులు ఉపశమనం పొందుతున్నారు.