ఉల్లి ఉచితం!!
సాక్షి, ముంబై: ఉల్లి.. వంటింట్లో ఉండే సరుకు కాదిప్పుడు... వినియోగదారులను ఆకట్టుకునే అయస్కాంతం..! డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్లు తమ వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు ‘ఉల్లి పథకం’ను ప్రవేశపెడుతున్నారు. దాదర్‌లోని కొన్ని డిపార్ట్మెంటల్ స్టోర్లు వెయ్యి రూపాయలకుపైగా కొనుగోలు చేస్తే కిలో ఉల్లి ఉచితమంటూ ఫ్లెక్సీలు, బోర్డులు పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయల దరిదాపునకు చేరుకుంది. దీంతో వినియోగదారులు కూడా దుస్తులు, ఎలక్ట్రిక్, గృహావసరాల కోసం ఎవైనా వస్తువులు కొనాలన్నా ముందుగా ‘ఉల్లి బోర్డు’ ఎక్కడుందో చూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఉల్లి బోర్డు ఉందంటే పరోక్షంగా పదిశాతం డిస్కౌంటు లభించినట్లే. నెలకు సరిపడా కిరాణా సామగ్రిని కొనాలన్నా ఎంతలేదన్నా కనీసం రెండువేలకు పైగానే అవుతుంది. అలాంటప్పుడు రెండు కేజీల ఉల్లి ఉచితం గా ఇచ్చినా రూ.200 మేర కలిసొచ్చే అవకాశముంది. దీంతో ప్రజలు కూడా ఈ ఆఫర్ పట్ల ఆకర్షితులవుతున్నారు.
జేబులు నింపుకుంటున్న చిల్లర వ్యాపారులు...
ఉల్లిపాయలు అమ్మే ఓ చిల్లర వ్యాపారి రోజుకు వంద కిలోల ఉల్లి అమ్మితే ఎంత లాభపడేవాడో ఇప్పుడు 30 కేజీల ఉల్లి అమ్మినా అంతే లాభపడుతున్నాడు. వాషిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో కిలో ఉల్లి ధర రూ. 40-50 మధ్య ఉండగా చిల్లర వ్యాపారులు కిలోకు రూ.20-30 పెంచి రూ.70-80లకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉల్లి ధర ఒకలా, దూరమున్న ప్రాంతాల్లో ఉల్లి ధర మరోలా ఉంటుంది. నిజానికి ఈ తేడా ఎప్పుడూ ఉండేదే అయినా ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు చిల్లర వ్యాపారులు భారీ వ్యత్యాసంతో ఉల్లిని విక్రయిస్తున్నారు.
క్యాబేజీ ముక్కలే దిక్కు...
బార్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఉల్లితో తయారయ్యే వంటకాలను లిస్టులోనుంచి తొలగిస్తున్నా యి. రెస్టారెంట్లలో ప్రత్యేకంగా ఉల్లి ముక్కలను వడ్డించే పరిస్థితి లేదు.
ఒకవేళ కావాలని ఎవరైనా డిమాండ్ చేస్తే క్యాబేజీ ముక్కలను కలిపి వడ్డిస్తున్నారు. కొందరైతే నేరుగానే లేదని చెప్పేస్తుండగా మరికొందరు ‘ప్రత్యేకంగా ఉల్లి వడ్డించబడదు’ అని మెనూలో గమనికలు పెడుతున్నాయి. ఇక టిఫిన్ సెంటర్లలో ఉల్లి పకోడి, ఉతప్పా, ఉల్లి దోసె మాయమైంది.
అమ్మో... ఎంత మాయో?
నిజానికి రాష్ట్రంలో ఉల్లి ఇంతగా ధరలు పెరగాల్సినంత కొరత లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొందరు కావాలనే ఉల్లికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉల్లి ధరలను తగ్గించేందుకు నానా అవస్థలు పడుతున్న ప్రభుత్వం మరి ఇలా కృత్రిమంగా కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకోవచ్చు కదా? అనే అనుమానం కలగడం సహజమే. అయితే కృత్రిమంగా కొరత సృష్టించేవారు ఇప్పడు కొత్త కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఈ విషయమై ఎన్హెచ్ఆర్డీఎఫ్సీ డెరైక్టర్ ఆర్.పి.గుప్తా మాట్లాడుతూ...‘మార్చి నుంచి మే వరకు పుణే, నగర్, షోలాపూర్, నాసిక్ తదితర జిల్లాల్లోని రైతుల నుంచి వ్యాపారులు నేరుగానే కోట్ల రూపాయల విలువ చేసే ఉల్లిని కొనుగోలు చేస్తారు. అయితే వాటిని గోదాముల్లోకి తరలించకుండా రైతుల వద్దే ఉంచుతారు. అందుకు రైతులకు కొంతమొత్తం అద్దె కూడా చెల్లిస్తారు. ఇలా మార్కెట్లోకి సరుకు రాకుండా చేసి కృత్రిమంగా కొరత సృష్టిస్తారు. సరుకు రైతుల వద్దే ఉండడంతో వ్యాపారులపై చర్య తీసుకునేందుకు మార్కెట్శాఖకు వీలుపడదు. సరుకు ధర ఆకాశన్నంటుతున్న తరుణంలో రైతుల వద్ద నిల్వ ఉంచిన ఉల్లిని భారీ ధరకు మార్కెట్‌కు తరలిస్తారు. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు ఎప్పుడు వచ్చే లాభం కంటే దాదాపు పదింత లాభం ఎక్కువగా వస్తుంద’న్నారు.
త్వరలో చైనా ఉల్లి
పెరిగిన ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేం దుకు చైనా నుంచి భారీగా ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లి చైనా నుంచి భారత్‌కు రవాణా అయ్యేందుకు సిద్ధంగా ఉందని మార్కెట్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25 వరకు అవి ముంబైకి చేరుకునే అవకాశముందన్నారు. వీటి ధర టన్నుకు 400 డాల ర్లు(అంటే రూ.27,639) ఉండవచ్చని అంచనవేశారు. అంటే కిలో ఉల్లి ధర దాదాపు రూ.28 ఉంటుంది. చైనా సరుకు మార్కెట్లోకి వస్తే ఉల్లి ధర బాగా తగ్గుతుందని చెబుతున్నారు.