ఆన్లైన్లో పార్కింగ్ బుకింగ్
న్యూఢిల్లీ: నగరంలోని పార్కింగ్ లాట్లను ఆధునీకరించాలని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) నిర్ణయించింది. కుటుంబ సమేతంగా మార్కెట్ల వద్దకు వచ్చిన తర్వాత వాహనాన్ని పార్క్ చేసే స్థలం లేకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దీంతో పార్కింగ్ లాట్లను ఆధునీకరించి, ఆన్లైన్ ద్వారా పార్కింగ్ కోసం బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఎన్డీఎంసీ భావిస్తోంది. అంతేకాకుండా పార్కింగ్ లాట్లను పూర్తిగా కంప్యూటరీకరించాలనే యోచనలో కూడా ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఖాన్ మార్కెట్, సరోజినీనగర్ మార్కెట్, దిల్లీ హాట్, శంకర్ మార్కెట్ వంటి రద్దీగా ఉండే మార్కెట్లలోని పార్కింగ్ లాట్లను ఆధునీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇక చార్జీల విషయానికి వస్తే ఎంతసేపు వాహనాన్ని పార్క్ చేశారో అంత సమయానికి మాత్రమే సొమ్ము వసూలు చేస్తారని చెప్పారు. ఇందుకోసం డ్రైవర్లకు ముందుగానే పార్కింగ్ కార్డులను విక్రయిస్తారని, లాట్లోకి వాహనం ప్రవేశించే సమయంలో దానిని స్కాన్ చేయడం ద్వారా సమయం రికార్డు అవుతుందన్నారు. అలా బయటకు వెళ్లే ముందు కూడా స్కాన్ కావడంతో ఎంతసేపు పార్కింగ్ లాట్లో వాహనం ఉందో లెక్కించి, అంత సమయానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారని చెప్పారు. ఇదంతా కంప్యూటర్ ఆధారంగానే సాగిపోతుంది. గత సంవత్సరమే ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని భావించినా ప్రైవేటు పార్కింగ్ లాట్ల యజమానుల అభ్యంతరం కారణంగా అమలు చేయలేకపోయామని, సాంకేతికపరమైన సమస్యలు కూడా మరో కారణమన్నారు.