ఆన్లైన్ పసుపు కొనుగోళ్లపై వివాదం
⇒ ఈ-గొడవ
⇒ ఈ-గొడవవివాదానికి దారితీసిన ‘ఆన్లైన్’
⇒ ఈ-గొడవఈ పద్ధతి వద్దంటున్న కమీషన్ ఏజెంట్లు
⇒ ఈ-గొడవదీంతో రైతులకు మేలంటున్న అధికారులు
⇒ ఈ-గొడవసమస్యను పరిష్కరించాలని రైతుల వాగ్వాదం
‘⇒ ఈ-గొడవసాంగ్లీ’ విధానం అమలు చేయాలని డిమాండ్
నిజామాబాద్ వ్యవసాయం : నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో గురువారం ఆన్లైన్ పసుపు కొనుగోళ్లపై వివాదం చెలరేగింది. ఈ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ వ్యవహారాన్ని తక్షణమే పరి ష్కరించాలని కోరుతూ రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ విధానంతో తమకూ అన్యాయం జరుగుతోందని వాపోయారు.
మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అమలవుతున్న పద్ధతిని అమలు చేయాలని కోరారు. సాంగ్లీలో పసుపు నాణ్యతను బట్టి ధరలను నిర్ణయిస్తారని పేర్కొన్నా రు. రైతులు కూడా పసుపును వేరు చేసి నాణ్యత గల పసుపును ఒక లాట్‌గాను, ఇతర రకాన్ని మరో లాట్‌గాను వేరు చేసి విక్రయిస్తారని, దీంతో రైతుకు నష్టం జరుగదని వివరించారు. నాణ్యత ప్రకారం ధర వస్తుందన్నారు. విషయా న్ని ఉన్నతాధికారులకు విన్నవించి, అందుబాటులోకి తీసుకొస్తామని మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎల్లయ్య రైతులకు హామీ ఇచ్చారు. ఈ-బిడ్డింగ్ ద్వారా రైతులకు కలిగే లాభాలను వివరించారు. దీంతో సమస్య సద్దుమణిగినప్పటికీ, వ్యాపారలావాదేవీలు మాత్రం కొనసాగలేదు.
అసలేం జరిగింది
నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో పసుపు విక్రయాలను కొంత కాలంగా ఈ- టెండర్ ద్వారా కొనసాగిస్తున్నారు. ఈ విధానంతో మోసాలు జరుగవని అధికార యంత్రాంగం భావించింది. అందుకోసమే ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించింది. ఈ విధానంతో రైతులకు లాభాల మాట దేవురెడుగు కానీ, ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పద్ధతిలో ఎక్కువ ధర కోడ్ చేసిన వ్యాపారికి రైతులు కమీషన్ ఏజెంటు ద్వారా పసుపును విక్రయించాలి.
ఇందుకు రైతులు సుముఖంగా ఉన్నా, కమీషన్ ఏజెంట్లు మాత్రం అంగీకరించడం లేదు. సదరు వ్యాపారిపై తమకు నమ్మకం లేదంటూ, తక్కువ కోడ్ చేసిన వ్యాపారికి విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే రైతుకు నష్టం వస్తుంది. గురువారం ఇదే కారణంగా వివాదం చెలరేగి వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. ఎక్కువ ధర కోడ్ చేసిన వ్యా పారి సకాలంలో డబ్బులు చెల్లించకుంటే తాము నష్టపోతామని కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు.
ఇది చినికి చినికి గాలివానగా మారింది. రైతులు, వ్యాపారులు, కమీష న్ ఏజెం ట్లు, అధికారులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది. చివరికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జోక్యం చేసుకుని రైతులకు ఇబ్బంది కలుగకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమస్యను తాను స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం పసుపు కొనుగోళ్లు యథావిధి గా జరుగుతాయని కార్యదర్శి ఎల్లయ్య తెలిపారు.
ఇదీ విషయం
ఆన్లైన్ విధానంతో నిజానికి రైతుకు లాభం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. పసుపు అమ్మగానే నిబంధనల ప్రకారం బిల్లు వస్తుందని, కమీషన్ కూడా నిబంధనల ప్రకారమే ఉంటుందని అంటున్నారు. ధరలో కోత ఉండదని, వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంటున్నారు. అన్ని వివరాలు తెలుపుతూ కంప్యూ టర్ ద్వారా తెలియజేసే చీటి కూడా వస్తుందంటున్నారు.
అదనపు కమీషన్లు వచ్చే అవకాశం లేనందునే ఏజెంట్లు ఈ విధానాన్ని అంగీకరించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే తమకు అనుకూలం గా ఉండే వ్యాపారులకు మాత్రమే పసుపును విక్రయించాలని ఒత్తిడి తెస్తు న్నా రంటున్నారు. అందుకోసం తమ మాట వినే రైతులను కూడా ఆ వైపున ప్రోత్స హిస్తున్నారని చెబుతున్నారు.