కాల్ చేస్తే.. ఆకతాయిల తాట తీస్తారు
రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌జిల్లాలో షీ టీం సేవలు
పవర్ చూపిస్తామంటున్న షీ టీం లీడర్ రమణమ్మ
అమ్మాయిలను వేధించాలనుకునే కుర్రకారుకి ఇక చెడ్డ రోజులు వచ్చినట్టే. యువతులతో పాటు మహిళలను వేధించేవారు ఎక్కడుంటే.. అక్కడ షీ టీం ప్రత్యక్షమవుతుంది. ఒక్కఫోన్ కాల్ చేస్తే.. ఆకతాయిల తాట తీసేందుకు షీ టీం ఉవ్విళ్లూరుతోంది. రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా పరిధిలో ఇటీవల షీ టీం సేవలు అందుబాటులోకి వచ్చాయి.
షీ టీం నంబరు : 99590 66755
కోరుకొండ :
ఎవరైనా మహిళలు అల్లరిమూకల వేధింపుల బారిన పడితే.. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు షీటీం పవర్ ఏమిటో చూపిస్తామంటున్నారు రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా నార్త్ సెంట్రల్‌జోన్ షీ టీం లీడర్, గోకవరం ఏఎస్సై ఎంవీ రమణమ్మ. శనివారం ఆమె కోరుకొండలో విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు షీ టీం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, కాలేజీలు, హైస్కూళ్లు, ప్రధాన కూడళ్లు, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో షీ టీం పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. షీ టీంలో ఆరుగురు మహిళా పోలీసులు మఫ్టీలో ఉంటారని చెప్పారు. ఆకతాయిలు అల్లరి చేసినా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా.. అలాంటి వారి వివరాలు సెల్ : 99590 66755 నంబరుకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. త్వరలో వాట్సాప్ నంబర్ కూడా తెలియజేస్తామని వెల్లడించారు. కీలకపాత్ర పోషించే ఈ విభాగానికి అసత్య సమాచారం ఇవ్వవద్దని కోరారు.
ఎక్కడైతే విద్యార్థినులు సమస్యల్లో ఉంటారో.. అక్కడ షీ టీం ప్రత్యక్షమవుతుందని రమణమ్మ తెలిపారు. గత రెండు రోజుల్లో మహిళలు, యువతను వేధిస్తున్న కోరుకొండలో ముగ్గురిని, రాజమహేంద్రవరంలో ఒకరిని, గోకవరంలో ఇద్దరిని పట్టుకుని, పోలీసు స్టేసన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. తొలుత కౌన్సెలింగ్ ఇచ్చి వదలి వేస్తామని, వారిలో మార్పు రాకపోతేlకేసులు నమోదు చేస్తామని తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులను కూడా చైతన్య పరుస్తున్నట్టు చెప్పారు.