పూడ్చిన మృతదేహం వెలికి తీత
నెల్లూరు (క్రైమ్) : తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని ఓ తల్లి ఫిర్యాదు మేరకు శ్మశానంలో పూడ్చిన మృతదేహాన్ని సోమవారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కోటమిట్టకు చెందిన సయ్యద్ జహరుల్లా (40)అలియాస్ జాకీ డ్యాన్స్‌మాస్టర్. ఆయన భార్యను వదిలి వేసి కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న జహరుల్లా తన తమ్ముడి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు వెళ్లాడు. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో తన సహాయకుడు పొర్లుకట్టకు చెందిన అబుతో కలిసి ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందో.. ఏమో తెలియదు కాని అతను తన ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కేసులు, పోస్టుమార్టం అని పోలీసులు ఇబ్బంది పెడతారని గుట్టుచప్పుడు కాకుండా 30వ తేదీ మృతదేహాన్ని ఫత్తేఖాన్‌పేటలోని ముస్లిం శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే తన కుమారుడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అతని తల్లి హసీనా ఈ నెల 1వ తేదీ ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని ఎవరో కొట్టి చంపారని ఫిర్యాదులో పేర్కొంది. మృతుడి సహాయకుడు అబ్బుపై అనుమానం వ్యక్తం చేయడంతో ఒకటో నగర ఇన్స్పెక్టర్ అబ్దుల్ కరీం కేసు నమోదు చేశారు. నగర డీఎస్పీ జి. వెంకటరాముడు సూచనల మేరకు నెల్లూరు తహసీల్దార్ సమక్షంలో సోమవారం మృతదేహాన్ని శ్మాశన వాటికలో వెలికితీయించి, అక్కడే ప్రొఫెసర్ సురేష్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే హత్య, ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని ఎస్సై తెలిపారు.